
అమరావతి, నవంబర్ 23: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి నిర్వహించనున్నట్లు తాజాగా పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ పరీక్షలు ఏప్రిల్ 1 వరకు ఆయా తేదీల్లో కొనసాగనున్నాయి. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులరెడ్డి విడుదల చేశారు. ఆయా తేదీల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరగనున్నాయి. ఈ ఏడాది ఫిజిక్స్, కెమిస్ట్రీలకు కలిపి ఒక పేపర్‌గా, జీవశాస్త్రం మరో పేపర్‌గా విడివిడిగా నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు 50 మార్కుల చొప్పున పరీక్షలు ఉంటాయి. అంతేకాకుండా ఈ సారి అన్ని సబ్జెక్టుల పరీక్షలకు మధ్య కొంత విరామం వచ్చేలా షెడ్యూల్‌ను రూపొందించారు.
కాగా నవంబరు 26 నుంచి డిసెంబరు 3 వరకు రూ.50 ఆలస్య రుసుముతో పదో తరగతి విద్యార్థులు ఫీజు చెల్లించడానికి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబరు 4 నుంచి 10 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబరు 11 నుంచి 15 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. రెగ్యూలర్ విద్యార్థులు అన్ని పేపర్లకు రూ. 125 చెల్లించాలి. ఫెయిన్ అయిన విద్యార్థులు 3 పేపర్ల కంటే ఎక్కువ ఉంటే రూ. 125, మూడు పేపర్లలోపు ఉంటే రూ. 110 చెల్లించాల్సి ఉంటుంది. వొకేషనల్ విద్యార్థులు అదనంగా మరో రూ. 60 చెల్లించాలని విద్యాశాఖ పేర్కొంది. విద్యార్ధులు గడువులోగా పరీక్ష ఫీజును చెల్లించాలని సూచించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.