అమరావతి, ఆగస్టు 27: గత ప్రభుత్వం హయాంలో అర్ధంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి కోర్టులో కొన్ని కేసులు నమోదైన సంగతి తెలిసిందే. వీటిపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని తదుపరి కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు, పోలీసు నియామక మండలి ఛైర్మన్ పీహెచ్‌డీ రామకృష్ణ సమీక్షలు నిర్వహించారు. ఆగస్టు నెలాఖరులోగా నియామక ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2022 నవంబరు 28న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. గతేడాది జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. ఈ పరీక్షకు 4,58,219 మంది హాజరయ్యారు. గతేడాది ఫిబ్రవరి 5న ఈ ఫలితాలు కూడా వెలువడ్డాయి. వీరిలో తదుపరి దశకు 95,209 మంది అభ్యర్ధులు ఎంపికయ్యారు. అర్హత సాధించిన వారిలో 77,876 మంది పురుషులు, 17,332 మంది మహిళలు ఉన్నారు. వీరికి అదే ఏడాది 13 నుంచి 20వ తేదీ వరకూ ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్‌లు నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు హాల్ టికెట్లు కూడా జారీ చేశారు. అయితే ఈ ప్రక్రియ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వల్ల ఆగిపోయింది. ఆ ఎన్నికలైపోయాక కూడా నియామక ప్రక్రియ కొనసాగించలేదు. ఇక అప్పటి నుంచి ఈ పోస్టుల భర్తీ గురించి పట్టించుకున్నా నాథుడే లేడు. ఇటీవల అధికారం చేపట్టిన ఎన్డీయే ప్రభుత్వం ఆ నియామక ప్రక్రియ కొనసాగింపు బాధ్యత తీసుకుంది.
ప్రిలిమినరీ పరీక్ష అనంతరం తదుపరి దశకు ఎంపికైన 95,208 మంది అభ్యర్థులకు.. రెండో దశలో దేహదారుఢ్య, శారీరక సామర్థ్య (పీఎంటీ, పీఈటీ) పరీక్షలు నిర్వహించాలి. నోటిఫికేషన్ జారీ కంటే రెండేళ్ల ముందు నుంచే అభ్యర్థులు కోటి ఆశలతో ఈ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. సకాలంలో నియామక ప్రక్రియ పూర్తికాకపోవడంతో వేరే పనులు చేసుకోలేక, ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది.