అమరావతి, నవంబర్ 3: ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన శారీరక సామర్థ్య పరీక్షలు గత ప్రభుత్వ హయాంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియను పునఃప్రారంభించేందుకు కూటమి సర్కార్ చర్యలు చేపట్టింది. ఈ ఏడాది డిసెంబరు చివరి వారంలో ఫిజికల్ టెస్ట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2022 నవంబరు 28న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు 2023 జనవరి 22న ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 4,59,182 మంది హాజరుకాగా.. అందులో 95,208 మంది అభ్యర్థులు తదుపరి దశకు అర్హత సాధించారు. ఇక వీరిలో 91,507 మంది మాత్రమే దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలకు అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నట్లు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు గుర్తించింది. దీంతో మిగిలిన వారికి కూడా దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తున్నామని బోర్డు ఛైర్మన్ ఈ సందర్భంగా తెలిపారు. నవంబరు 11వ తేదీ సాయంత్రం 3 గంటల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు పోర్టల్ ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. నవంబర్ 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇదే చివరి అవకాశమని, గతంలో దేహదారుఢ్య పరీక్షలకు దరఖాస్తు చేసుకోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని అభ్యర్ధులకు సూచించారు.
కాగా 2022 నవంబరులో 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి ప్రాథమిక రాతపరీక్ష నిర్వహించినా.. దేహదారుఢ్య, శారీరక సామర్థ్య (పీఎంటీ, పీఈటీ) పరీక్షలు జరపలేదు. 2023 మార్చిలో నిర్వహిస్తామని షెడ్యూల్ ఇవ్వడంతోపాటు హాల్‌టికెట్లు జారీ చేశాక.. పట్టభద్రుల ఎన్నికల పేరుతో వాయిదా వేశారు. ఎన్నికల తర్వాత కూడా ఈ ప్రక్రియ నిర్వహించలేదు. అయితే ఇప్పటి వరకూ దీనికి సంబంధించిన షెడ్యూల్ రాకపోవడంతో ఈ పరీక్షలు నిర్వహిస్తారో లేదో తెలియక అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నోటిఫికేషన్ జారీ కంటే రెండేళ్ల ముందు నుంచే అభ్యర్థులు ఈ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్ చేసిన ప్రకటన కానిస్టేబుల్ అభ్యర్ధులకు ఊరట కలిగించినట్లైంది.