అమరావతి, నవంబర్ 4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ (DSC Notification) మరో రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం జారీచేయనుంది. ఇప్పటికే నవంబరు 6వ తేదీన ఉద్యోగ ప్రకటన చేయనున్నట్లు విద్యాశాఖ ప్రటకన విడుదల చేసింది. ఆ లోపు ఎలాంటి న్యాయ వివాదాలు లేకుండా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యాశాఖ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) పోస్టులు 6,371, స్కూల్ అసిస్టెంట్లు (ఎస్‌ఏ) పోస్టులు 7725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులు 1781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులు 286, ప్రిన్సిపల్ పోస్టులు 52, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు (పీఈటీ) 132 వరకు ఉన్నాయి. ఇక టెట్ ఫలితాలు ఈ రోజు మంత్రి నారా లోకేష్ చేతుల మీదగా వెలువడనున్నాయి. దాదాపు 4 లక్షల మంది అభ్యర్ధులు ఈ సారి టెట్‌కు హాజరయ్యారు. ఎంత మంది ఉత్తీర్ణత పొందుతారనేది వేచి చూడాలి. ఇక జగన్ సర్కార్ హయాంలో జరిగిన టెట్ పరీక్షతో పోల్చితే ఇటీవల జరిగిన టెట్ పరీక్షలు మరింత కఠినంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంత మంది ఉత్తీర్ణత సాధిస్తారనేది ఉత్కంఠగా మారింది.
టెట్ ఫలితాలు వచ్చాక 2వ రోజే డీఎస్సీ ప్రకటన ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు నవంబర్ 6వ తేదీన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. జిల్లాల వారీగా ఖాళీల వివరాలకు సంబంధించి జిల్లాల వారీగా రోస్టర్ వివరాలు సమర్పించాలని ఇటీవల పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. నోటిఫికేషన్ వెలువడిన 4 నెలల్లోనే డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తిచేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
వీటితో పాటు గురుకుల, ఆదర్శ పాఠశాలలు, బీసీ, గిరిజన పాఠశాలల్లో 2,281 వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం.
ఏపీ డీఎస్సీ 2024 అధికారిక వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.