అమరావతి, జనవరి 8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా బుధవారం (జనవరి 8) సంచలన ప్రటకన చేశారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులకు పబ్లిక్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించాలనే ఏకైక లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇకపై ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షలను మాత్రమే నిర్వహించినున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతీకా శుక్లా వెల్లడించారు. ఈ మేరకు బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇంటర్ విద్యలో పలు సంస్కరణలు తీసుకొస్తున్నాం. ప్రపంచ స్థాయి పోటీ తట్టుకునే విధంగా ఇంటర్ విద్యార్దులను తయారు చేయాలన్నదే లక్ష్యం.
ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్ ఇకపై తెలుగు-ఇంగ్లీషులో ఉంటుంది. సబ్జెక్టు ఎక్స్‌పర్ట్స్ కమిటీ ఈ సిలబస్‌పై దృష్టి పెట్టింది. NCERT సిలబస్ వల్ల మాథ్స్, కెమిస్ట్రీలో ప్రస్తుతం ఉన్న సిలబస్ బాగా తగ్గుతుంది. ఇంటర్ లో ప్రతి సబ్జెక్టుకు ఇకపై 20 ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. సంస్కరణలకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటున్నాం. జనవరి 26 వరకు వెబ్‌సైట్‌లో అభిప్రాయం చెప్పచ్చు. గత కొన్నేళ్లుగా ఇంటర్ బోర్డ్‌లో సంస్కరణలు జరగలేదు. గత కొన్నేళ్లుగా పాఠ్య పుస్తకాల్లో మార్పులు జరగలేదని కృత్తిక శుక్లా ఈ సందర్భంగా వెల్లడించారు.