అమరావతి, సెప్టెంబర్ 6: ఆంధ్రప్రదేశ్‌లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు మొదటి విడత ఐసెట్-2023 అడ్మిషన్ల కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను ప్రభుత్వం బుధవారం (సెప్టెంబర్ 6) విడుదల చేసింది. రాష్ట్రంలో ఉన్న కళాశాలల్లో కన్వీనర్ కోటాలో వెబ్ కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియను ఉన్నత విద్యామండలి చేపట్టనుంది. ఈ ఏడాది ఎంట్రన్స్ టెస్ట్ లు పూర్తయి చాలాకాలం గడిచినప్పటికీ ప్రవేశాల ప్రక్రియ మాత్రం ఆలస్యం అవుతూ వచ్చింది. కాలేజీల్లో ఫీజుల నిర్ధారణ, అఫిలియేషన్ ఆలస్యం కావడం వంటి అంశాలతో కౌన్సిలింగ్ కాస్త ఆలస్యం అవుతుందని ఉన్నతవిద్యామండలి అధికారులు చెప్పారు. గత మే నెల 24 వ తేదీన జరిగిన ఐసెట్ ఎంట్రన్స్ లో అర్హత పొందిన విద్యార్ధులు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ కు హాజరుకావచ్చని అధికారులు తెలిపారు. అడ్మిషన్లు పొందిన విద్యార్ధులకు సెప్టెంబర్ 27 వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
కాగా ఏపీ ఐసెట్ 2023 ప్రవేశ పరీక్షను మే 24వ తేదీన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐసెట్ ప్రవేశ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 49,162 మంది దరఖాస్తుకున్నారు. వీరిలో దాదాపు 44 వేల మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు జూన్ 15వ తేదీన విడుదలయ్యాయి. ఐసెట్-2023లో సాధించిన ర్యాంకు ఆధారంగా సెప్టెంబర్ 8 నుంచి నిర్వహించే కౌన్సెలింగ్‌లో సీట్లు కేటాయిస్తారు. 2023-24 విద్యా సంవత్సరానికి గానూ ఏపీలోని పలు యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైటను సందర్శించవచ్చు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.