
అమరావతి, డిసెంబర్ 4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి2026లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. అయితే ఈసారి జరగబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో స్వల్ప మార్పులు చేసినట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. పరీక్షలకు హాజరయ్యే జనరల్, ఓపెన్ స్కూల్, ఒకేషనల్ కేటగిరీల విద్యార్థులు ఈ మార్పులను పరిశీలించాలని సూచించింది. వచ్చే మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అంతర్గత మార్కుల వెయిటేజీ ఉండదని స్పష్టం చేసింది. ప్రతి సబ్జెక్టుకు 100 మార్కులకు 7 పేపర్ల విధానం ఉంటుందని పేర్కొంది.
ఒకటో భాష, రెండో భాష, మూడో భాషా పేపర్లు, గణితం, సోషల్ స్టడీస్ సబ్జెక్టులకు ఒక్కొక్క పేపర్ ఉంటుందని, ప్రతి పేపర్ 100 మార్కులకు ఉంటుందని స్పష్టం చేసింది. అయితే జనరల్ సైన్స్ సబ్జెక్టుకు మాత్రం ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షలు రెండు వేర్వేరు రోజుల్లో 50 మార్కుల చొప్పున ఉంటాయని తెలిసింది. ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ పేపర్ 1లో 70 మార్కులకు, పేపర్ 2లో 30 మార్కులకు ఉంటుంది. ఈ మేరకు పరీక్షల్లో మార్పులు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ తన ప్రకటనలో తెలిపింది.
పట్టణ ప్రాంతాల్లో తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.24 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో 2.5 ఎకరాల తడి భూమి లేదా 5 ఎకరాల పొడి భూమి మించని వారి పిల్లలకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. మార్చి 2026లో తొలిసారి రెగ్యులర్ పరీక్షకు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. అలాగే వికలాంగులు, కేజీబీవీ విద్యార్థినులకు కూడా ఫీజు మినహాయింపు ఉంటుంది. 2011 సెప్టెంబర్ ముందు పుట్టిన వారు మాత్రమే 10వ తరగతి పరీక్షలు రాసేందుకు అర్హులుగా స్పష్టం చేసింది. వయసు అధికంగా ఉన్నవారు రూ.300 చెల్లించి ఏడాదిన్నర వరకు వయసు సడలింపుకు ఆయా స్కూళ్లలోని హెచ్‌ఎంలు అనుమతి ఇవ్వొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.