అమరావతి, డిసెంబర్ 24: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ ప్రకారం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 17 నుంచి జరగనున్నాయి. ఈ క్రమంలో విద్యార్ధుల్లో పదో తరగతి పరీక్షల భయం మొదలైంది. ప్రణాళిక ప్రకారం పాఠ్యాంశాలు చదువుకుంటే సులభంగా పరీక్షలు రాయవచ్చు. అయితే గత మూడేళ్లలో పదో తరగతి ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవని కూటమి ప్రభుత్వం అంటోంది. దీంతో ఈ ఏడాది మెరుగైన ఫలితాలు సాధించేలా వంద రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తోంది. డిసెంబరు 2 నుంచి ఇది అమలవుతోంది.
ఇందులో భాగంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని సుమారు 2 వేల మంది విద్యార్థులు ఈ ఏడాది టెన్త్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఫలితాలు మెరుగ్గా సాధించేందుకు ఇక్కడి స్కూళ్లలోని ప్రతి ఉపాధ్యాయుడు 5 నుంచి 8 మంది విద్యార్థులను దత్తత తీసుకుంటున్నారు. వారికి సబ్జెక్టుల వారీగా మెలకువలు నేర్పించడం, అత్యధిక మార్కులు సాధించేందుకు ప్రేరణ కలిగిస్తున్నారు. గతంలో ఒక్కో పీరియడ్ 45 నిమిషాలు ఉండగా.. ప్రస్తుతం ఈ ప్రణాళికలో 90 నిమిషాల వరకు పెంచారు. ప్రతి సబ్జెక్టుపై పాఠ్యాంశాల వారీగా తర్ఫీదు ఇవ్వాలనే లక్ష్యంతో సమయాన్ని పెంచారు.
విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ.. ప్రిపరేషన్ సాగేలా కృషి చేస్తారు. ఉదయం 8 నుంచి 9 వరకు, సాయంత్రం 4 నుంచి 5 వరకు కూడా అదనపు పీరియడ్‌లు నిర్వహిస్తున్నారు. రోజుకో సబ్జెక్టులో విద్యార్థులకు పరీక్షలు జరిపి, మార్కులను సమీక్షిస్తున్నారు. ఇలా ప్రతి విద్యార్థి అత్యధిక మార్కులు సాధించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని ప్రత్తిపాడు ఉపాధ్యాయులు చెబుతున్నారు.