
అమరావతి, మే 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవగా.. ఈ నెల 15 వరకు దరఖాస్తులు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో తాజాగా కూటమి సర్కార్ క్రీడా కోటాలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా డీఎస్సీ నోటిఫికేషన్ కింద క్రీడా కోటాలో 421 పోస్టులను కేటాయించినట్లు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. క్రీడా కోటాలో తగిన విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు ఎలాంటి రాతపరీక్ష లేకుండానే ఉద్యోగాలు ఇస్తామని ఆయన వెల్లడించారు. మెగా డీఎస్సీలో భాగంగా క్రీడా కోటా నోటిఫికేషన్‌ను విజయవాడలోని శాప్ కార్యాలయంలో బుధవారం (ఏప్రిల్ 30) మంత్రి విడుదల చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన క్రీడాకారులు స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు శుక్రవారం (మే 2) నుంచి ప్రారంభమవుతాయి. మే 31 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మొత్తం 30 రోజుల పాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారన్నమాట. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులను సంబంధిత క్రీడా రంగంలో ప్రతిభ, సీనియారిటీ ఆధారంగా కేటాయిస్తారని మంత్రి తెలిపారు.
జోన్ -1లో 6 పోస్టులు
జోన్-2లో 6 పోస్టులు
జోన్-3లో 11 పోస్టులు
జోన్-4లో 11 పోస్టులు
రాష్ట్ర స్థాయిలో 2 పోస్టులు
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.