పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు తెలుగులోనూ రాసేందుకు అవకాశం..?

AP 10th Exams in Telugu Medium: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో విద్యాబోధన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను కూడా ఇంగ్లిష్‌ మాధ్యమంలోనే నిర్వహిస్తున్నారు. అయితే టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు ఇంగ్లిష్‌ మీడియంతోపాటు తెలుగు మాధ్యమంలోనూ రాసుకునే అవకాశం కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ సముఖత తెలిపింది..

పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు తెలుగులోనూ రాసేందుకు అవకాశం..?
10th Exams In Telugu Medium

Updated on: Aug 17, 2025 | 6:14 PM

అమరావతి, ఆగస్ట్ 17: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో విద్యాబోధన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను కూడా ఇంగ్లిష్‌ మాధ్యమంలోనే నిర్వహిస్తున్నారు. అయితే టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు ఇంగ్లిష్‌ మీడియంతోపాటు తెలుగు మాధ్యమంలోనూ రాసుకునే అవకాశం కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ సముఖత తెలిపింది. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ హామీ ఇచ్చిన హామీ మేరకు ఏపీ ఉపాధ్యాయ సంఘం (ఆపస్‌) ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం కొనసాగించాలని ఆపస్‌ సభ్యులు మంత్రి లోకేష్‌ని కోరారు. దీనిపై మంత్రి లోకేష్‌ స్పందిస్తూ కొన్ని పాఠశాలల్లోనైనా కొనసాగించేందుకు ప్రయత్నిస్తామని చెప్పినట్లు వెల్లడించారు.

ఈ మేరకు ఉండవల్లిలోని నివాసంలో శనివారం మంత్రి లోకేశ్‌ను ఆపస్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌ బాలాజీ, జీవీ సత్యనారాయణ, కోశాధికారి సురేష్‌ కుమార్, ఉపాధ్యక్షులు సునీత మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సెప్టెంబర్‌ 1వ తేదీన ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే ‘మై స్కూల్‌.. మై ప్రైడ్‌’ పోస్టర్‌ను మంత్రి లోకేష్‌ ఆవిష్కరించారు అనంతరం ఆపస్‌ సభ్యులు విద్యారంగంలోని పలు సమస్యలను, బడుల్లోని ఉపాధ్యాయుల పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆపస్‌ సభ్యులు తెలిపారు.

అలాగే డీఎస్సీ 2003 వారికి పాత పింఛను అమలును త్వరగా పరిష్కరిస్తామని కూడా మంత్రి లోకేష్‌ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. హైస్కూల్‌ ప్లస్‌లు సైతం కొనసాగిస్తామని, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా త్వరలో పీజీటీల నియామకం చేపడతామని మంత్రి తెలియజేశారు. ఇక రాష్ట్రంలోని అంతర జిల్లాల్లో ఉపాధ్యాయుల బదిలీలు త్వరలోనే చేపడతామని అన్నారు. డీఈవో పూల్‌లో ఉన్న పండితులు, పీఈటీల పదోన్నతుల విషయంలో ఉన్న ఇబ్బందులు కూడా వీలైనంత త్వరగా తొలగిస్తామని తెలిపారు. వీరికి త్వరలో పదోన్నతులు చేపడతామని మంత్రి లోకేష్‌ హామీ ఇచ్చారు. సెప్టెంబరు 5 తర్వాత ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి లోకేష్ ఈ సందర్భంగా తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.