
అమరావతి, మే 5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రవేశ పరీక్షలు రేపట్నుంచి (మే 6) నుంచి ప్రారంభమవనున్నాయి. మే 6 నుంచి జూన్ 13 వరకు దాదాపు ఎనిమిది ప్రవేశ పరీక్షలను ఉన్నత విద్యా మండలి వరుసగా నిర్వహించనుంది. ఈ మేరకు తాజాగా షెడ్యూల్ కూడా విడుదల చేసింది. మే 6న ఈసెట్, 7న ఐసెట్ పరీక్షల నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. పరీక్ష కేంద్రాల వద్దకు నిర్ణీత సమయానికంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది.
ఇప్పటికే పరీక్షల తేదీల వారీగా హాల్‌టికెట్లను కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు తమ హాల్‌టికెట్‌తో పాటు వ్యక్తిగత గుర్తింపు కార్డు, బ్లాక్ లేదా బ్లూ బాల్‌పాయింట్ పెన్నును మాత్రమే పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లాలని సూచించింది. ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను అనుమతించబోమని స్పష్టం చేసింది. హాల్‌టికెట్‌పై ముద్రించిన వివరాలపై అభ్యంతరం ఉంటే పరీక్షా కేంద్రంలోని అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లాలని, విద్యార్ధులందరూ తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు అరగంట ముందే చేరుకోవాలని సూచించింది. ఈ మేరకు ఏపీ ఈసెట్‌ను మంగళవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈసెట్ కన్వినర్ ప్రొఫెసర్ బి దుర్గాప్రసాద్ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఈసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా లేటరల్ ఎంట్రీ కింద డిప్లొమా పూర్తి చేసిన వారికి ఇంజినీరింగ్ సెకండియర్‌లో నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈసెట్ పరీక్ష మే 6వ తేదీన మొత్తం రెండు షిఫ్టులలో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో జరగనుంది. మొదటి షిఫ్టు ఉదయం సెషన్ 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. ఇక మధ్యాహ్నం సెషన్ 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు సెకండ్ షిఫ్ట్‌లో జరుగుతుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.