National Police Academy Hyderabad – IPS Passing Out Parade: 72వ బ్యాచ్‌కు చెందిన IPS ఆఫీసర్ల పాసింగ్ ఔట్ పరేడ్ రేపు జరగనుంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అథుల్ కార్వాల్ టీవీ9కు తెలిపారు. కాగా, ఈ బ్యాచ్‌లో మొత్తం 178 మంది ఐపీఎస్‌లు 58 వారాల శిక్షణ పూర్తి చేసుకున్నారు. 144 మంది ప్రొబేషనరీలతో పాటు 34 మంది ఫారిన్ అధికారులకు ట్రైనింగ్ పూర్తయింది. ఇందులో 33 మంది మహిళా IPS అధికారులు కూడా ఉన్నారు.
కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ సారి ఐపీఎస్ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు డైరెక్టర్ కార్వాల్ తెలిపారు. సైబర్ క్రైమ్, క్రైమ్ సీన్స్, బొర్డర్ సెక్యూరిటీపైనా అవగాహన కల్పించారు. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ట్రైనీ ఐపీఎస్ అధికారులకు అవార్డులు కూడా ప్రదానం చేశారు. ఇందులో రంజిత్ శర్మ అనే ఐపీఎస్ ట్రైనీ మొదటి బహుమతి సాధించారు.
తెలుగు రాష్ట్రాల నుంచి ఏడుగురు ఐపీఎస్ అధికారులు ట్రైనింగ్ తీసుకున్నారు. తెలంగాణ నుంచి ముగ్గురు, ఏపీ నుంచి 4 అధికారులు ఉన్నారు. కొవిడ్ కారణంగా రేపు జరిగే పాసింగ్ ఔట్ పరేడ్‌కు ఎవరినీ అనుమతించడం లేదని అందరూ సహకరించాలని డైరెక్టర్ కార్వాల్ సూచించారు.
ట్రైనింగ్ విజయవంతంగా పూర్తికావడంపై ఐపీఎస్‌లు సంతోషం వ్యక్తం చేశారు. 58 వారాల పాటు కఠోర శిక్షణ పొందినట్లు కొత్త ఐపీఎస్ శిక్షకులు చెప్పారు. ఔట్ డోర్ ట్రైనింగ్‌లో ఇబ్బందులు ఎదురైనా తట్టుకొని నిలిచామన్నారు. పట్టుదలతో కష్టపడి చదివితే ఎవరైనా ఏదైనా సాధించవచ్చన్నారు ట్రైనీ ఐపీఎస్‌లు.
Read also: Devineni Uma: రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన దేవినేని ఉమ.. సర్కారుపై నిప్పులు