
హైదరాబాద్, సెప్టెంబర్ 13: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ పరీక్షల నిర్వహణ, నియామకాలు అధికారులకు సవాల్‌గా మారాయి. ఓ వైపు గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించిన మొత్తం నియామక ప్రక్రియ పూర్తై పోస్టింగ్ స్థాయిలో ఉన్న సమయంలో అనూహ్యంగా హైకోర్టు మెయిన్స్ ఫలితాలను రద్దు చేసింది. మరోవైపు గ్రూప్ 1 నియమకాలు పూర్తైతేగానీ గ్రూప్ 2 నియామకాలు చేపట్టేది లేదని గతంలో టీజీపీఎస్సీ తెలిపింది. ఈ క్రమంలో కమిషన్ మరో కీలక అడుగు వేసింది. గ్రూప్ 1 లొల్లి ఇప్పట్లో కొలిక్కివచ్చేలా కనిపించడం లేదు. దీంతో గ్రూప్ 2 పోస్టుల నియామకాలు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ మూడో విడత తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ప్రకటించింది.
సెప్టెంబరు 13న ఉదయం 10.30 గంటల నుంచి నాంపల్లి పబ్లిక్‌గార్డెన్‌లోని సురవరం ప్రతాప్‌రెడ్డి యూనివర్సిటీలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరుగుతుందని కమిషన్ తెలిపింది. ఇక ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరైన అభ్యర్ధుల్లో ఎవరైనా సమర్పించాల్సిన పత్రాలు ఇంకా ఏమైనా పెండింగ్‌లో ఉంటే వాటిని సెప్టెంబరు 15న సమర్పించవచ్చని పేర్కొంది.
కాగా మొత్తం 783 గ్రూప్ 2 పోస్టులకు టీజీపీఎస్సీ నియామక ప్రక్రియ చేపట్టింది. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు టీజీపీఎస్సీ తెలిపింది. ఇందులోనూ అభ్యర్ధులు ఎవరైనా గైర్హాజరైతే వారి అభ్యర్ధిత్వం రద్దు చేయబడుతుందనీ, ఆ పోస్టును తదుపరి ర్యాంకు వచ్చిన వారికి అందజేస్తామని ఈ సందర్భంగా కమిషన్ కార్యదర్శి నవీన్ నికొలస్ స్పష్టం చేసింది. ఈ పోస్టులకు 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్లను పరిశీలించి, నియామక పత్రాలు సమర్పించనున్నట్లు ఇప్పటికే టీజీపీఎస్సీ వెల్లడించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.