డెలివరీ ఏజెంట్స్ సమయంతో సంబంధం లేకుండా ఉరుకులు, పరుగులు పెడుతూ సేవలందిస్తుంటారు. ఒక్కసారి ఆర్డర్స్ స్వీకరించారంటే అదే వేటలో ఉంటారు. ఇలా బిజీ షెడ్యూల్‌తో పనిచేసే ఏజెంట్స్‌కి కాస్త రెస్ట్ తీసుకుందామన్న సమయం లభించదు. పోనీ సమయం దొరికినా ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలో తెలియని పరిస్థితి. దీంతో ఏ చెట్టు కిందో సేదతీరుతుంటారు. అయితే ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో ఓ నిర్ణయం తీసుకుంది. డెలివరీ ఏజెంట్ల కోసం ‘రెస్ట్ పాయింట్లు’ ఏర్పాటు చేస్తోంది.
ఈ రెస్ట్ పాయింట్లు కేవలం జొమాటో ఏజెంట్స్ వారికి మాత్రమే పరిమితం కాకుండా ఇతర సంస్థలకు చెందిన డెలివరీ ఏజెంట్లు సైతం వీటిని వినియోగించుకోవచ్చని జొమాటో తెలిపింది. జొమాటా సీఈఓ దీపిందర్ గోయల్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. గురుగ్రామ్‌లో ఇప్పటికే రెండు రెస్ట్ పాయింట్లు ఏర్పాటు చేశామని, త్వరలోనే మరికొన్ని చోట్ల ఏర్పాటు చేసేందుకు జొమాటో నిర్ణయించిందని గోయల్ తెలిపారు. ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఈ రెస్ట్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ రెస్ట్‌పాయింట్స్‌లో డ్రింకింగ్ వాటర్, సెల్‌ఫోన్ ఛార్జింగ్, ఇంటర్నెట్ సదుపాయం, ఫస్ట్- ఎయిడ్, 24×7 హెల్ప్‌డెస్క్, వాష్ రూమ్స్ వంటి సదుపాయం కల్పించనున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా విధులు నిర్వర్తిస్తున్న డెలివరీ ఏజెంట్స్ సంక్షేమంలో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నట్లు గోయల్ తెలిపారు. ఈ రెస్ట్ పాయింట్స్ ఏర్పాట్లతో ఏజెంట్లు శారీరకంగా, మానసికంగా అలసట నుంచి విముక్తి పొందుతారని ఆయన అభిప్రాయపడ్డారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..