Health Insurance: ఆరోగ్య బీమా క్లెయిమ్‌ రిజెక్ట్‌ అయ్యిందా? ఇలా చేస్తే సమస్యకు పరిష్కారం

ఇటీవల కాలంలో ఆరోగ్య బీమాపై ప్రజలకు అవగాహన పెరిగింది. ముఖ్యంగా కోవిడ్‌-19 తర్వాత అందరూ వీటిని విరివిగా తీసుకుంటున్నారు. అదే సమయంలో వాటి క్లయిమ్‌ సెటిల్‌ రేషియోకూడా పడిపోతోంది. చాలా ప్రైవేటు కంపెనీలు వివిధ కారణాలను సాకుగా చూపి క్లయిమ్‌లను రిజెక్ట్‌ చేస్తున్నట్లు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌డీఏఐ) గుర్తించింది.

Health Insurance: ఆరోగ్య బీమా క్లెయిమ్‌ రిజెక్ట్‌ అయ్యిందా? ఇలా చేస్తే సమస్యకు పరిష్కారం
Health Insurance

Updated on: Apr 01, 2025 | 8:45 PM

ప్రముఖ ప్రైవేటు బీమా సంస్థ అయిన స్టార్‌ హెల్త్‌ ఇన్సురెన్స్‌ కంపెనీ క్లయిమ్‌ల పరిష్కార ప్రక్రియల్లో లోపాలున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో అన్ని బీమా సంస్థల క్లయిమ్‌లపై ఐఆర్‌డీఏఐ మరోసారి దృష్టి కేంద్రీకరించింది. దీనిలో భాగంగా 8 నుంచి 10 జనరల్‌, హెల్త్‌ ఇన్సురెన్స్‌ కంపెనీల్లో తనిఖీలు నిర్వహించింది. దీని విచారణ పూర్తయిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నారు.

పాక్షిక చెల్లింపులే ఎక్కువ..

క్లయిమ్‌ రిజెక్షన్స్‌ పక్కన పడితే ఇటీవల కాలంలో పరిష్కారమైన క్లయిమ్‌లలో కూడా పాక్షిక చెల్లింపులే ఎక్కువని తెలుస్తోంది. 2024 జూన్ నుంచి డిసెంబర్ మధ్య సోషల్ మీడియా పోర్టల్ అండ్‌ సర్వే సంస్థ లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో పది మంది పాలసీదారులలో ఐదుగురు తమ క్లెయిమ్‌లను పాక్షికంగా లేదా పూర్తిగా తిరస్కరించారని స్పష్టం చేశారు. అలాగే 2023-24 సంవత్సరానికి బీమా అంబుడ్స్‌మన్ కార్యాలయం నుంచి వచ్చిన వార్షిక నివేదిక ప్రకారం, 95 శాతం ఆరోగ్య బీమా ఫిర్యాదులు పాక్షికంగా లేదా పూర్తిగా రిజెక్ట్‌ చేసిన క్లయిమ్‌లే ఉన్నాయి. బీమా బ్రోకర్ల సంఘం(ఐబీఏఐ) అధికారుల ప్రకారం, సెటిల్ చేసిన మొత్తం పరంగా క్లెయిమ్‌ల చెల్లింపు నిష్పత్తి తక్కువగా ఉండటానికి ఒక కారణం ఏమిటంటే, బీమా సంస్థలు చిన్న క్లెయిమ్‌లను చెల్లిస్తాయి కానీ పెద్ద క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయని, ఇది కస్టమర్లకు ఇబ్బందిని కలుగజేస్తుందని పేర్కొంది.

సమస్య పరిష్కారం ఇలా..

ఒక వేళ సహేతుకమైన కారణం లేకుండా బీమా క్లయిమ్‌ను కంపెనీలు తిరస్కరిస్తే వినియోగదారుడు ఆ కంపెనీపై కేసు ఫైల్‌ చేసే అవకాశం ఉంది. అందుకు అంబుడ్స్‌మన్‌ అనే ఆప్షన్‌ ఉంది. అయితే ముందుగా మీరు ఆ బీమీ కంపెనీ నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్నట్లుగా ఆ కంపెనీకి తెలియజేస్తూ ఫిర్యాదు చేయాలి. అందుకోసం ప్రతి బీమీ కంపెనీకి ఫిర్యాదు పరిష్కారం అధికారి(జీఆర్‌ఓ) ఉంటారు. అలాగే ఐఆర్‌డీఏఐ పోర్టల్‌ ద్వారా కూడా మీరు ఫిర్యాదులు దాఖలు చేయొచ్చు. బీమా సంస్థ 30 రోజుల్లోపు మీకు సంతృప్తికరంగా ఫిర్యాదును పరిష్కరించలేకపోతే లేదా స్పందించకపోతే, మీరు మీ జిల్లాలోని బీమా అంబుడ్స్‌మన్ కార్యాలయాలను సంప్రదించవచ్చు. ఈ కార్యాలయాలు రూ. 50 లక్షల వరకు ఉన్న కేసులను పరిష్కరిస్తాయి. ఒకవేళ మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని అంబుడ్స్‌మన్ భావిస్తే, అటువంటి మధ్యవర్తిత్వం కోసం పరస్పర లిఖిత సమ్మతి పొందిన ఒక నెలలోపు ఒక ఆర్డర్ జారీ అవుతుంది. మీరు ఒకవేళ ఐఆర్‌డీఏ, అంబుడ్స్‌ మన్‌ ద్వారా కూడా సంతృప్తి చెందకపోతే వినియోగదారుల కోర్టులను ఆశ్రయించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి