జీవితంలో మనిషి కోరుకునే ఏకైక లక్ష్యం ఆర్థిక స్వేచ్ఛ. పూర్తి ఆర్థిక స్వేచ్ఛతో జీవితాన్ని ఆస్వాదించడానికి అందరూ ప్రయత్నిస్తారు. అయితే కొందరే ఆ లక్ష్యాన్ని అందుకుంటటారు. ఏ వయసులోనైనా ఆర్థిక స్వేచ్ఛను సాధించడానికి ఉత్తమ మార్గం సరైన పథకాన్ని ఎంచుకొని దానిలో పెట్టుబడులు పెట్టడం. ఇది దీర్ఘకాలంలో మీకు మంచి రాబడినిచ్చి ఆర్థికంగా స్వేచ్ఛగా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా పదవీవిరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఉండకూడదని చాలా మంది భావిస్తారు. జీవితాంతం శ్రమించి.. వృద్ధాప్యంలో కూడా మరొకరిపై ఆధారపడటానికి ఇష్టపడరు. అలాంటి వారు పదవీ విరమణ ప్రణాళికను పకడ్బందీగా చేసుకుంటున్నారు. అందుకోసం అందుబాటులో ఉన్న బెస్ట్ స్కీమ్ నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్). దీనిలో ఉద్యోగం చేస్తున్న సమయం నుంచి పెట్టుబడులు పెట్టడం వల్ల పదవీ విరమణ సమయంలో భారీ మొత్తంలో నగదు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి నెలా మంచిగా పెన్షన్ పొందే వీలూ ఉంటుంది. మీకు 60 ఏళ్లు వచ్చినప్పుడు, మీరు 60 శాతం వరకు లేదా మీ మొత్తం కార్పస్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు లేదా మీరు మీ మొత్తం కార్పస్‌ను యాన్యుటీలలో పెట్టుబడి పెట్టవచ్చు. అలా పెట్టే పెట్టుబడి నుంచి మీకు రూ. 1.14 లక్షల వరకు పెన్షన్‌ని పొందడంలో సహాయపడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ 2004లో ప్రారంభించింది. ఆ తర్వాత ప్రైవేట్ ప్లేయర్లు కూడా ఎన్పీఎస్ పథకాలను అమలు చేసేందుకు అనుమతించింది. ఇది స్వచ్ఛంద పెట్టుబడి పథకం. ఇందులో 18 నుంచి 75 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా పెట్టుబడి పెట్టొచ్చు. అయితే ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) దీనిలో పెట్టడానికి అనుమతి లేదు. దీనిలో కనీసం రూ. 500పెట్టుబడితో ప్రారంభించొచ్చు. ఎటువంటి గరిష్ట పరిమితి లేదు.
పన్ను ప్రయోజనాలు.. దీనిలో పెట్టుబడిపై పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. గరిష్ట పన్ను మినహాయింపు రూ. 2 లక్షలు వరకూ ఉంటుంది. సెక్షన్ 80సీసీడీ కింద పన్ను చెల్లింపుదారు రూ. 1.50 లక్షల వరకు పన్ను ప్రయోజనాలను పొందేందుకు అనుమతించబడతారు. అయితే, ఎవరైనా ఎన్పీఎస్ టైర్-1 ఖాతాను ఎంచుకుంటే, వారు మరో రూ. 50,000 పన్ను మినహాయింపు పొందవచ్చు.
మెచ్యూరిటీ సమయం.. దీని మెచ్యూరిటీ వయసు ఖాతాదారుడికి 60 ఏళ్ల వయస్సు వచ్చినప్పుడు ఉంటుంది. ఆ సమయంలో డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు ఉపకరిస్తుంది. ఎవరైనా 60 సంవత్సరాల వయస్సులో కార్పస్‌ను ఉపసంహరించుకుంటే, వారు గరిష్టంగా 60 శాతం కార్పస్‌ను ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు.
అకాల ఉపసంహరణలు.. కొన్ని షరతులతో లేదా ఖాతాదారుడి మరణ సమయంలో అకాల ఉపసంహరణలకు అనుమతిస్తుంది. పన్ను రహిత పాక్షిక ఉపసంహరణలు మూడు సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి ఉంటుంది. ఒకరు ఏడాదిలో మొత్తం మూడు సార్లు విత్‌డ్రా చేసుకోవచ్చు. అది కూడా మొత్తం పెట్టుబడిలో 25 శాతం మాత్రమే. పిల్లల వివాహం, ఉన్నత విద్య, తీవ్రమైన అనారోగ్యం, ఇంటి కొనుగోలు లేదా నిర్మాణం మొదలైన పరిస్థితులలో పాక్షిక ఉపసంహరణ చేయవచ్చు.
పాక్షిక అకాల నిష్క్రమణ.. ప్రీ మెచ్యూర్ క్లోజర్ కి ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. మొత్తం కార్పస్‌లో 20 శాతం మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 80 శాతాన్ని యాన్యుటీల కొనుగోలుకు వినియోగించాల్సి ఉంటుంది. అయితే, ఒకరి మొత్తం కార్పస్ రూ. 2.50 లక్షల కంటే తక్కువ ఉంటే, వారు తమ డబ్బులో 100 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు.
డెత్ క్లెయిమ్‌లు.. ఒక ఖాతాదారుడు మెచ్యూరిటీ/60 సంవత్సరాల వయస్సు పూర్తి కాకముందే మరణిస్తే, నామినీ వారి కార్పస్‌లో 100 శాతం ఉపసంహరించుకోవచ్చు. అయితే, ఖాతాదారు మెచ్యూరిటీ తర్వాత మరణిస్తే, ఎంచుకున్న యాన్యుటీ ప్లాన్ ప్రకారం చట్టపరమైన వారసుడు పెన్షన్/రాబడులను అందుకుంటారు.
ఎన్పీఎస్ లక్ష్యం పదవీ విరమణ తర్వాత నెలవారీ పెన్షన్ పొందడం కాబట్టి, పదవీ విరమణ సమయంలో మన ద్రవ్యోల్బణం-సర్దుబాటు ఖర్చులు, మన జీవనశైలిని భరించడంలో సహాయపడే పెన్షన్ కోసం మనం నెలవారీ పెట్టుబడిని తెలుసుకోవాలి. ఎన్‌పిఎస్‌లో, మీరు 30 సంవత్సరాల పాటు నెలకు కేవలం రూ. 10,000 పెట్టుబడి పెడితే.. 60 ఏళ్ల వయస్సులో నెలకు 1 లక్ష కంటే ఎక్కువ పెన్షన్ పొందే అవకాశం ఉంది. మీకు 30 ఏళ్లు ఉండి, ఎన్‌పీఎస్ పథకంలో తదుపరి 30 సంవత్సరాలకు, అంటే 60 ఏళ్ల పదవీ విరమణ వయస్సు వరకు నెలకు రూ. 10,000 ఇన్వెస్ట్ చేస్తే, ఆ సంవత్సరాల్లో మీ మొత్తం పెట్టుబడి రూ. 3600,000 (రూ. 36 లక్షలు) అవుతుంది. ఆ సంవత్సరాల్లో మీరు 10 శాతం రాబడిని అంచనా వేసినట్లయితే, మీరు రూ. 19193254 (రూ. 1.91 కోట్లు) వరకూ లాభాలను పొందుతారు. అప్పుడు మీ మొత్తం రాబడి రూ. 22793254 (రూ. 2.28 కోట్లు) అవుతుంది.
మెచ్యూరిటీ సమయంలో, మీ చేతిలో రూ.2.28 కోట్లు ఉన్నాయి. కాబట్టి మీకు రెండు ఆప్షన్లు ఉంటాయి. ఏకమొత్తంలో 60 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన 40 శాతం యాన్యుటీలలో పెట్టుబడి పెట్టవచ్చు. లేదా మొత్తం విత్ డ్రా చేసుకోవచ్చు. లేదా మొత్తం యాన్యుటీలలో పెట్టుబడి పెట్టొచ్చు.
మీరు మీ కార్పస్ మొత్తాన్ని యాన్యుటీలలో పెట్టుబడి పెట్టినప్పుడు, ప్రభుత్వం లేదా ప్రైవేట్ ఏజెన్సీలు ఆ డబ్బును బాండ్స్ లేదా డెట్ ఆప్షన్‌లలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇక్కడ మీరు సంవత్సరానికి కనీసం 6 శాతం వడ్డీని పొందవచ్చు. యాన్యుటీల్లో రూ.2.28 కోట్లు పెట్టుబడి పెడితే నెలవారీ ఆదాయం రూ.1,13,966.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..