Kanya Sumangala Yojana: ఆడబిడ్డల చదువు కోసం రూ. 15 వేలు.. సీఎం సంచలన నిర్ణయం!

ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాధ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి బడ్జెట్‌లో 'కన్యా సుమంగళ యోజన' అనే..

Kanya Sumangala Yojana: ఆడబిడ్డల చదువు కోసం రూ. 15 వేలు.. సీఎం సంచలన నిర్ణయం!
Kanya Sumangala Scheme

Updated on: Feb 22, 2023 | 7:09 PM

ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాధ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి బడ్జెట్‌లో ‘కన్యా సుమంగళ యోజన’ అనే పధకానికి భారీగా నిధులు కేటాయింపులు చేసింది యోగీ సర్కార్. ఇందుకోసం ఏకంగా రూ.1050 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ప్రస్తుతం ఈ స్కీం సామాన్యులకు మరింత చేరువైంది. ఉత్తరప్రదేశ్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పధకం కింద మీ కుమార్తె పుట్టినప్పటి నుంచి ఆమె వివాహం వరకు ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరిస్తుంది.

ఈ పథకంలో భాగంగా యోగీ సర్కార్.. స్కీంలో భాగమైన లబ్దిదారులకు రూ.15,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. దీని ద్వారా రాష్ట్రంలోని ఆడపిల్లలను స్వావలంబనగా తీర్చిదిద్దేందుకు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గత బడ్జెట్‌ కంటే.. ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ స్కీమ్‌లో కేటాయింపులు భారీగా పెంచడం గమనార్హం.

ఇదిలా ఉంటే.. ‘కన్యా సుమంగళ యోజన’ పధకం కింద యూపీలోని బాలికలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15000 అందజేస్తుంది. ఈ మొత్తాన్ని 6 సమాన వాయిదాలలో లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి వేస్తారు. ఇక ఈ పధకం ప్రయోజనం పొందటానికి లబ్దిదారుడి కుటుంబ వార్షికాదాయం 3 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి. అలాగే ఈ స్కీం ద్వారా బాలికలకు ఉన్నత విద్యను అందించి వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని అధికారులు తెలిపారు. కాగా, ఈ పధకాన్ని యూపీ సర్కార్ ఏప్రిల్ 2019లో ప్రారంభించగా.. ఈసారి బడ్జెట్‌లో స్కీంకు భారీగా నిధులు కేటాయించారు సీఎం యోగీ ఆదిత్యనాద్.

పధకం గురించి మరిన్ని విషయాలు..

  1. ఈ పథకం ప్రయోజనం పొందడానికి, మీ ఖాతా ప్రభుత్వ బ్యాంకు, పోస్టాఫీసు లేదా గ్రామీణ బ్యాంకులో ఉండాలి
  2. ఒక కుటుంబంలో కవల కుమార్తెలు ఉన్నప్పటికీ, ఇద్దరు ఆడపిల్లలు ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారు.
  3. దత్తత తీసుకున్న పిల్లలకు కూడా ఈ పథకం లబ్ది అందిస్తుంది.
  4. ఈ పథకం లబ్ది చేకూరేందుకు దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఉత్తరప్రదేశ్‌లో శాశ్వత నివాసి అయి ఉండాలి

ఈ స్కీంకు అవసరమైన డాక్యుమెంట్స్..

  1. ఆధార్ కార్డు
  2. పాస్‌పోర్ట్ సైజు ఫోటో
  3. మొబైల్ నంబర్
  4. నివాస ధృవీకరణ పత్రం
  5. బ్యాంకు ఖాతా వివరాలు
  6. కుమార్తెను దత్తత తీసుకుంటే దత్తత ధృవీకరణ పత్రం
  7. సంరక్షకుల గుర్తింపు కార్డు
  8. చిరునామా రుజువు