ప్రైవేట్ బ్యాంక్ అయిన యెస్ బ్యాంక్ వినూత్న పథకంతో ముందుకు వచ్చింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్ల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. టర్మ్ డిపాజిట్లనూ రెపో రేటుతో అనుసంధానిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు బ్యాంకులు రుణాలకే ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ రేటు ను వర్తింప చేస్తున్నాయి. వాస్తవానికి రిజర్వ్‌బ్యాంకు వడ్డీరేట్ల పెంపు ప్రయోజనాన్ని ఖాతాదారులకు అందజేసేందుకు బ్యాంకులు చాలా సమయం తీసుకుంటాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల రెండు పరపతి సమావేశాల్లో కలిపి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.90శాతం మేరకు రెపో రేటును పెంచింది. దీనికి అనుసంధానంగా ఉన్న రుణాల వడ్డీ రేట్లు కూడా పెంచారు.
కానీ, ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను బ్యాంకులు పెద్దగా సవరించనట్లు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రెపో రేటు మారినప్పుడల్లా డిపాజిట్ రేట్లూ అందుకు తగ్గట్టుగా పెరిగే, ఫ్లోటింగ్ రేట్ ఎఫ్‌డీని యెస్ బ్యాంక్ తీసుకొచ్చింది. ఏడాది నుంచి మూడేళ్ల వ్యవధితో ఈ డిపాజిట్లు అందుబాటులో ఉంటాయని బ్యాంక్ తెలిపింది. రెపో రేటు మారినప్పుడల్లా ఈ ఎఫ్‌డీ వడ్డీ రేటు మారిపోతుందని బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. ఫ్లోటింగ్ రేట్ FD కాలవ్యవధి 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. బ్యాంక్ ఇటీవలే Paytm చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ధీరజ్ సంఘీని తన బ్రాంచ్ బ్యాంకింగ్ దేశాధిపతిగా నియమించింది.