Financial Crisis: ముంచుకొస్తున్న మాంద్యంపై ప్రపంచ బ్యాంక్ హెచ్చరికలు.. వృద్ధి నిలిచిపోతుందంటూ..

|

Jun 14, 2022 | 6:04 PM

Financial Crisis: రానున్న మరి కొద్ది నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చే ప్రమాదం పొంచి ఉందని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో దిగ్గజ వ్యాపార వేత్తల నుంచి మదుపరులు, బ్యాంకర్లతో పాటు ప్రపంచబ్యాంక్‌ సైతం హెచ్చరించింది.

Financial Crisis: ముంచుకొస్తున్న మాంద్యంపై ప్రపంచ బ్యాంక్ హెచ్చరికలు.. వృద్ధి నిలిచిపోతుందంటూ..
Financial Crisis
Follow us on

Financial Crisis: రానున్న మరి కొద్ది నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చే ప్రమాదం పొంచి ఉందని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో దిగ్గజ వ్యాపార వేత్తల నుంచి మదుపరులు, బ్యాంకర్లతో పాటు ప్రపంచబ్యాంక్‌ సైతం హెచ్చరించింది. ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి నెమ్మదిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఆ తరువాత కొన్ని దేశాలు తీవ్ర మాంద్యంలో చిక్కుకుంటాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక మాంద్యం నుంచి కొన్ని దేశాలు తప్పించుకోలేవని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే వృద్ధి రేటును సైతం భారీగా కుదించింది. 2022లో అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధి 2.9 శాతంగా ఉండవచ్చని వెల్లడించింది.

రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభంతో ఇంధన, ఆహార ఉత్పత్తుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీని కారణంగా సప్లై చైన్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. దీంతో సరకుల రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. మరో పక్క కరోనా కేసులు క్రమంగా మళ్లీ పెరగటం కూడా ఆర్థిక వ్యవస్థలపై మళ్లీ ప్రభావం చూపుతోంది. ఈ కారణంగా అనేక దేశాల్లో ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయిలకు చేరుకుంది. ఈ కారణంగా అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించాయి. కీలక వడ్డీ రేట్లను క్రమంగా పెంచుతున్నాయి. భారత రిజర్వు బ్యాంక్ సైతం రెండు నెలల కాలంలో రెపో రేటును ఏకంగా 90 బేసిస్ పాయింట్ల మేర పెంచింది.

ఇదే సమయంలో యూఎస్ లో ద్రవ్యోల్బణం 40 సంవత్సరాల గరిష్ఠాలకు చేరుకోవటంతో ఆ ప్రభావం ప్రపంచ దేశాలపైనా పడుతోంది. దీనిని అదుపుచేసే క్రమంలో అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపుకు సిద్ధమవుతోంది. ఈ విషయంలో అక్కడి ఆర్థిక వేత్తలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమాంతం రేట్లు పెంచుతూ ఉండే ఆర్థిక వ్యవస్థ కుంచించుకుపోతుందని వారు అంటున్నారు. దీని వల్ల డిమాండ్ పడిపోయి ఉత్పత్తి చేసే సంస్థలపై కూడా భారీగా ప్రభావం పడుతుందని అంటున్నారు. ఈ క్రమంలో వారు 2008 ఆర్థిక మాంద్యం నాటి పరిస్థితులను గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిన్న పాటి మాంద్యం సైతం ప్రపంచ దేశాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని ప్రపంచ బ్యాంక్ హెచ్చరిస్తోంది. ప్రపంచ దేశాలు ఈ పరిస్థితులను జాగ్రత్తగా అదుపులోకి తెచ్చుకోవాలని వారు అంటున్నారు. రానున్న రోజుల్లో ప్రపంచ దేశాలు స్టాగ్‌ఫ్లేషన్‌ పరిస్థితులను చూడాల్సి వస్తుందని వారు అంటున్నారు. ఇది ద్రవ్యోల్బణం కంటే చాలా ప్రమాదకరమైనదని వారు అంటున్నారు.