Stock Market: ఆపరేషన్ సింధూర్‌తో స్టాక్ మార్కెట్‌పై ప్రభావం పడుతుందా..? నిపుణులు అంచనాలు తెలిస్తే షాక్

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారతదేశం పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడి చేసింది. ప్రతిసారీ దాడి జరగలేదని చెప్పే పాకిస్థాన్ కూడా దాడి జరిగిందని ఒప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఉద్రిక్తతలు స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయా? అనే విషయం సగటు పెట్టుబడిదారుడు అనుమానిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ వల్ల స్టాక్ మార్కెట్‌పై ఏర్పడే ప్రభావం గురించి కీలక విషయాలను తెలుసుకుందాం.

Stock Market: ఆపరేషన్ సింధూర్‌తో స్టాక్ మార్కెట్‌పై ప్రభావం పడుతుందా..? నిపుణులు అంచనాలు తెలిస్తే షాక్
Stock Market

Updated on: May 07, 2025 | 3:35 PM

పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో భారతదేశం దాడులు చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో బెంచ్‌మార్క్ స్టాక్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ సాపేక్షంగా ప్రశాంతంగా ఉన్నాయి. పాకిస్థాన్ మిలటరీ క్యాంపులను గానీ, పౌరులను కానీ లక్ష్యంగా దాడులు జరగకపోవడం కేవలం ఉగ్రవాద శిబిరాలపైనే దాడులు జరగడం వల్ల మార్కెట్‌లో పెద్దగా ప్రభావం చూపదని నిపుణులు చెబుతున్నారు. కచ్చితంగా భారతదేశంలో ప్రతీకారం తీర్చుకుంటుందని ఎప్పటి నుంచో ఊహిస్తున్న విషయమే. అందువల్ల మార్కెట్‌లో ఈ ప్రభావం పెద్దగా పడలేదు. బుధవారం మార్కెట్ ప్రారంభంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 0.2% లేదా 155.7 పాయింట్లు క్షీణించి 80,641 వద్ద స్థిరపడగా, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 50 0.3 శాతం లేదా 81.55 పాయింట్లు పడిపోయి 24,379 వద్ద ముగిసింది. 

నిఫ్టీలో అగ్రస్థానంలో ఉన్న వాటిలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, జియో ఫైనాన్షియల్, ఎస్‌బీఐ లైఫ్, ట్రెంట్, ఎటర్నల్ ఉన్నాయి. అయితే భారతదేశ విస్తృత మార్కెట్లు బాగా నష్టపోయాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 2 శాతం తగ్గాయి. అలాగే నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 2.2% పడిపోయాయి. బీఎస్‌ఈలో ట్రేడవుతున్న 4,072 స్టాక్‌లలో 3,209 క్షీణించగా, 742 మాత్రమే పురోగమించాయి. ఇది విస్తృత బలహీనతను సూచిస్తుంది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఇటీవల పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో గత రెండు వారాలుగా మార్కెట్ పెద్దగా పుంజుకోలేదని నిపుణులు వివరిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న అనిశ్చితి కారణంగా నిఫ్టీ 200–400 పాయింట్లు సరిదిద్దుకోగలిగినప్పటికీ పరిస్థితి పూర్తి స్థాయి సంఘర్షణగా దిగజారితే తప్ప లోతైన క్షీణత అసంభవమని చెబుతున్నారు. 

ఈ రోజే ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన ఫలితం వెలువడనున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు చాలా జాగ్రత్తగా ఉన్నారు. భారతదేశం ప్రతీకార చర్యల వల్ల మార్కెట్ ప్రభావితం అయ్యే అవకాశం లేదని ఎందుకంటే మార్కెట్‌కు ముందే తెలుసని కొంత మంది నిపుణులు చెబుతున్నారు. అయితే ఆపరేషన్ సింధూర్‌పై పాకిస్థాన్ తీసుకునే చర్యలు.. భారత్ ప్రతి స్పందన వంటి విషయాలపై మార్కెట్ ఆధారపడి ఉందని, వెంటనే కలిగే నష్టం ఏదీ లేదని పేర్కొంటున్నారు . ఫెడరల్ రిజర్వ్ రేట్లు కూడా స్థిరంగా ఉంచుతుందనే అంచనాల నేపథ్యంలో స్వల్పకాలికంగా మార్కెట్ దిశను ప్రభావితం చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..