
ఎస్ఏఐసీ యాజమాన్యంలోని ఎంజీ మోటార్స్ తన భారతీయ కార్ల వ్యాపారంలో మెజారిటీ వాటాను విక్రయించడానికి ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి డీల్‌ను ముగించేందుకు అధునాతన చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎంజీ మోటార్స్ చైనాకు చెందిన ఎస్‌ఏఐసీ మోటార్‌కు సంబంధించిన సంస్థ. ఈ సంస్థ హలోల్ గుజరాత్‌లోని దాని తయారీ ప్లాంట్‌లతో సహా కంపెనీలో తన వాటాలను తగ్గించాలని యోచిస్తోంది. భారతదేశం, చైనా ఉద్రిక్తతలను ఎదుర్కొంటున్న సమయంలో ఈ వార్త ప్రస్తుతం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ప్రధానంగా ప్రస్తుం ఉద్రిక్తల నేపథ్యంలో చైనా వాటాలు కలిగిన అనేక కంపెనీలు వివిధ అంశాలకు సంబంధించి భారత ప్రభుత్వంతో అడ్డంకులను ఎదుర్కొంటున్నాయి. ఇది తాజా పెట్టుబడులకు ఆమోదాలు చైనా నుంచి విడిభాగాల సోర్సింగ్, సుంకాలు, పన్నులు మొదలైన వాటి రూపంలో ఉండవచ్చు. ఎంజీ మోటార్ తన భారతీయ కార్యకలాపాల్లో అదనపు పెట్టుబడుల కోసం దాని మాతృ సంస్థ నుంచి నిధులను సేకరించే విషయంలో ప్రభుత్వ అనుమతిని కూడా కోరింది. ఈ నిధులు మంజూరై ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతున్నా ఫలితం లేదు. అందువల్ల కంపెనీ ఇప్పుడు ఇతర మార్గాల ద్వారా అంటే భారతీయ సంస్థల ద్వారా మూలధనాన్ని సేకరించాలని నిర్ణయించుకుంది.
భారతదేశంలో మార్కెట్‌లో వృద్ధి కోసం రాబోయే రెండు నుంచి నాలుగు సంవత్సరాలలో సుమారు రూ. 5,000 కోట్ల మూలధనాన్ని సేకరించాలని యోచిస్తున్నట్లు వాహన తయారీ సంస్థ ఎంజీ మోటర్స్ పేర్కొంది. దీని కోసం భారతదేశంలోని భాగస్వాములు, పెట్టుబడిదారులకు మెజారిటీ వాటాను అందించేందుకు ఈ సంస్థ ముందుకువచ్చింది. ప్రస్తుతం ఈ కంపెనీ వాటాలను కొనేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ హీరో గ్రూప్, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ వంటి కంపెనీలు పోటీపడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అయితే ఎంజీ ఇండియా విస్తరణ ప్రణాళిక ప్రకారం 2028 నాటికి ముఖ్యంగా ఈవీ పోర్ట్‌ఫోలియోను విస్తరించడంలో నిమగ్నమవుతుంది. కంపెనీ రాబోయే ఐదేళ్లలో నాలుగు నుంచి ఐదు కొత్త ఆల్-ఎలక్ట్రిక్ మోడళ్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే ఈ విక్రయాల ద్వారా 65 నుంచి 75 శాతం ఆదాయాన్ని సాధించాలని కోరుకుంటోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..