క్రూడ్ ఆయిల్ ధరలు ఢమాల్.. దేశంలో పెట్రోల్ రేట్లు తగ్గుతాయా..? అసలు కథ ఇదీ..

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు దారుణంగా పడిపోతున్నాయి. ఏకంగా ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధానికి ముందు ఉన్న ధరల స్థాయికి ముడిచమురు రేట్లు దిగివచ్చాయి. మరి గ్లోబల్ మార్కెట్‌లో రేట్లు ఇంతలా తగ్గుతుంటే.. మన దేశంలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయి? అనే విషయాలు తెలుసుకుందాం..

క్రూడ్ ఆయిల్ ధరలు ఢమాల్.. దేశంలో పెట్రోల్ రేట్లు తగ్గుతాయా..? అసలు కథ ఇదీ..
Global Crude Oil Crashes To Pre War Levels

Updated on: Jun 25, 2026 | 5:19 PM

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతల తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఎట్టకేలకు భారీగా దిగివస్తున్నాయి. యుద్ధానికి ముందు ఉన్న ధరల స్థాయికి క్రూడ్ ఆయిల్ రేట్లు పడిపోతుండటంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలకు పెద్ద ఉపశమనం లభించినట్లయింది. ఈ నేపథ్యంలో మనదేశంలో కూడా పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు తగ్గుతాయా? అనే చర్చ ఇప్పుడు జోరందుకుంది. ప్రపంచ ముడిచమురు సరఫరాలో అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ గుండా ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలు యథావిధిగా జరుగుతుండడంతో సరఫరా మెరుగైంది. స్వల్పకాలంలో చమురు నిల్వలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. వెస్ట్రన్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఆయిల్ ధర 70 డాలర్ల కంటే దిగువకు పడిపోయి, ప్రస్తుతం బ్యారెల్‌కు 69.55 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు 72.89 డాలర్లకి చేరుకుంది. యుద్ధం ప్రారంభానికి ముందు ఫిబ్రవరి 28న బ్రెంట్ క్రూడ్ ధర రూ.72 వద్దే ఉండటం గమనార్హం.

ఇండియన్ క్రూడ్ బాస్కెట్ పరిస్థితి ఏంటి?

భారతదేశం దిగుమతి చేసుకునే ముడిచమురు సగటు ధర కూడా అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా భారీగా తగ్గింది. పెట్రోలియం మంత్రిత్వ శాఖకు చెందిన PPAC డేటా ప్రకారం.. జూన్ 23 నాటికి ఈ ధర బ్యారెల్‌కు 74.34 డాలర్లకి చేరుకుంది. యుద్ధానికి ముందు భారత్ కొనుగోలు చేసిన ముడిచమురు ధర 70.70 డాలర్లు గా ఉండేది. అంటే మనం కూడా దాదాపు ప్రీవార్ స్థాయి ధరలకు చాలా చేరువగా వచ్చేశాం.

మరి మన దగ్గర ధరలు తగ్గుతాయా?

అంతర్జాతీయంగా ధరలు తగ్గినంత మాత్రాన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గిపోవు. ఎందుకంటే దేశీయ ఇంధన ధరలు అనేక ఇతర అంశాలపై ఆధారపడి ఉంటాయి.

డాలర్‌తో రూపాయి విలువ: యుద్ధం తర్వాత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే బలహీనపడటం వల్ల భారతీయ రిఫైనరీలు ఇప్పటికీ దిగుమతుల కోసం ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు: దేశంలో పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు అత్యధికంగా ఉన్నాయి.

పాత స్టాక్ లెక్కలు: కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇటీవల మాట్లాడుతూ.. రిఫైనరీలు ప్రస్తుతం పాత ధరలకు కొన్న ముడిచమురును వాడుతున్నాయని, కొత్తగా తక్కువ ధరకు కొనుగోలు చేసిన చమురు అందుబాటులోకి వస్తే కొత్త లెక్కలు మారుతాయని తెలిపారు. అయితే ధరల తగ్గింపుపై ఆయన ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు.

ఆర్థిక వ్యవస్థకు బూస్టర్ డోస్

ముడిచమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో ఇలాగే మరికొన్నాళ్లు తక్కువగా కొనసాగితే.. భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. దేశంలో ఇంధన ధరలు తగ్గితే రవాణా ఖర్చులు తగ్గి, ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు, సామాన్యుడి జేబుకు పెద్ద ఊరటనిస్తుంది.

Follow Us