
కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు షాక్ ఇవ్వనుంది. ప్రతీ ఏడాది విద్యుత్ బిల్లులు పెరిగేలా కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే దేశంలో కరెంట్ ఛార్జీలు పెరగడంతో సామాన్యులకు భారంగా మారుతోంది. నెలవారీ ఖర్చులకు డబ్బులు సరిపోక అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. భవిష్యత్తులో కరెంట్ బిల్లులు మరింత పెరగనున్నాయి. కేంద్రం ప్రభుత్వం కొత్తగా జాతీయ విద్యుత్ విధానం 2026 తీసుకురాబోతుంది. ఈ ముసాయిదాను ఈ బడ్జెట్‌లో కేంద్రం ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. విద్యుత్ రంగంలో పెద్ద మైలురాయిగా మారునున్న ఈ విధానంతో ఏయే మార్పులు రానున్నాయో చూద్దాం.
ఈ కొత్త మసాయిదాలో ఇండెక్స్ లింక్డ్ టారిఫ్‌లను కేంద్రం ప్రతిపాదించింది. అంటే ద్రవ్యోల్బణం, ఖర్చులతో విద్యుత్ ధరలను అనుసంధానించనుంది. దీని వల్ల ఖర్చులకు తగ్గట్లు విద్యుత్ ఛార్జీలు ప్రతీ ఏడాది లేదా నిర్ణిత వ్యవధిలో పెరుగుతాయి. బొగ్గు ధరలు, విద్యుత్ ఉత్పత్తి ఖర్చు పెరగడం, డిస్కంల ఖర్చులు పెరగడం, విద్యుత్ రేటు తదనుగుణంగా పెరగడం వల్ల కరెంట్ బిల్లులు పెరుగుతాయి. రాష్ట్రాల డిస్కంలు సకాలంలో ఛార్జీలను సవరించడంలో విఫలమైతే విద్యుత్ బిల్లులు పెరిగే అవకాశముంది. విద్యుత్ సంస్థలు నష్టాల నుంచి బయటపడేందుకు, ఖర్చులను భరించేందుకు ఈ కొత్త విధానంలో మార్పులు రానున్నాయి.
ఇండియాలో విద్యుత్ సరఫరా ఖర్చు సగటును యూనిట్‌కు రూ.6.8గా ఉంది. ఇందులో పంపిణీ, ఉత్పత్తి, ప్రసారం పరిపాలనా ఖర్చులు ఉన్నాయి. అయితే అనేక రాష్ట్రాల్లో వ్యవసాయ, గృహ విద్యుత్ కనెక్షన్ల నుంచి తక్కువ ధరలను వసూలు చేస్తున్నారు. దీని వల్ల విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టాలను చవిచూస్తున్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థలు తాము చేసిన ఖర్చులను తిరిగి పొందలేకపోతున్నాయి. దీని వల్ల విద్యుత్ సంస్థలు నష్టాల్లో కూరుకుపోవడంతో అప్పులు క్రమంగా పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో పెడుతున్న ఖర్చు, వస్తున్న ఆదాయాన్ని సమతూల్యం చేసేందుకు ఇండెక్స్ లింక్డ్ టారిఫ్ విధానం అమలు చేసేందుకు కేంద్రం మొగ్గు చూపుతోంది. దీని వల్ల ఖర్చులు పెరిగితే కొద్ది టారిఫ్‌లను పెంచవచ్చు. విద్యుత్ ఉత్పత్తి, కొనుగోళ్లు ఖర్చులు పెరిగితే ఆటోమేటిక్‌గా వినియోగదారులకు విద్యుత్ బిల్లులు పెరుగుతాయి. ఇందుకోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం లేదు. ఈ విధానం వల్ల నెలనెలా విద్యుత్ బిల్లుల్లో హెచ్చుతగ్గులు నమోదు కావొచ్చు. ప్రస్తుతం ఈ విధానం మసాయిదా దశలో ఉండగా.. ప్రభుత్వం అందరి సూచనలను కోరుతుంది.