బంగారం కంటే స్పీడ్‌గా పైపైకి.. ఇది తెలుసుకుంటే మీరు అవాక్కవడం పక్కా..

భారతీయ సంస్కృతిలో బంగారం, వెండి ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. అయితే భవిష్యత్తులో ఈ విలువైన లోహాల కంటే జింక్ అనే లోహానికే ఎక్కువ డిమాండ్ పెరిగి, విలువ కూడా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జింక్ వాడకం మన దేశంలో వేగంగా రెట్టింపు కానుంది. ముఖ్యంగా తుప్పు పట్టకుండా ఉక్కును రక్షించడానికి, సౌర, పవనశక్తి ప్రాజెక్టులలో జింక్ ఎక్కువగా అవసరం అవుతుంది.

బంగారం కంటే స్పీడ్‌గా పైపైకి.. ఇది తెలుసుకుంటే మీరు అవాక్కవడం పక్కా..
Why Zinc Demand Is Surging

Updated on: Oct 24, 2025 | 4:04 PM

దేశంలో బంగారం, వెండికి శతాబ్దాల చరిత్ర ఉంది. భారతీయ సంప్రదాయంలో ఇదొక భాగంగా మారిపోయింది. శ్రేయస్సు, శుభానికి చిహ్నాలుగా పిలిచే ఈ లోహాలు లేకుండా శుభకార్యాలు జరగడం అసాధ్యమనే చెప్పాలి. అయితే రాబోయే కాలంలో జింక్ అనే లోహం ఈ సంప్రదాయ లోహాల విలువను అధిగమించగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. జింక్ డిమాండ్ ఎలా పెరుగుతోంది..? బంగారం స్థానాన్ని ఇది ఎలా ఆక్రమించనుంది..? అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

దూసుకుపోతున్న జింక్

అంతర్జాతీయ జింక్ అసోసియేషన్ డైరెక్టర్ ఆండ్రూ గ్రీన్ ప్రకారం.. దేశంలో జింక్ వినియోగం అసాధారణ స్థాయిలో పెరుగుతోంది. ప్రస్తుతం దేశం ఏటా 1.1 మిలియన్ టన్నుల జింక్‌ను వినియోగిస్తోంది. అయితే రాబోయే దశాబ్దంలో ఈ వినియోగం దాదాపు రెట్టింపు అయ్యి 2 మిలియన్ టన్నులకు చేరుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఈ పెరుగుదల రేటు బంగారానికి ఉన్న డిమాండ్‌ను సైతం అధిగమించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

జింక్ స్థిరత్వం – బంగారం అస్థిరత

గత ఏడాది కాలంలో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. ఏడాది క్రితం 10 గ్రాముల బంగారం ధర రూ. 75,000 ఉండగా.. ప్రస్తుతం అది రూ. 1.2 లక్షలను దాటింది. బంగారం ధరలలో ఈ హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ.. జింక్ వినియోగం, డిమాండ్ మాత్రం స్థిరంగా పెరుగుతూ వస్తుందని ఆండ్రూ గ్రీన్ తెలిపారు.

భారత్‌లో తక్కువ వినియోగం

ప్రస్తుతం ప్రపంచ జింక్ ఉత్పత్తి సంవత్సరానికి 13.5 మిలియన్ టన్నులుగా ఉంది. అయితే దేశంలో తలసరి జింక్ వినియోగం ప్రపంచ సగటు కంటే నాలుగు నుంచి ఐదు రెట్లు తక్కువగా ఉంది. ఈ అంతరాన్ని పూడ్చడానికి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ తన జింక్ వినియోగాన్ని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని ఆండ్రూ గ్రీన్ అభిప్రాయపడ్డారు.

పారిశ్రామిక, హరిత రంగాల్లో కీలక పాత్ర

భవిష్యత్తులో జింక్ పరిశ్రమకు మరింత ప్రాముఖ్యత లభించడానికి ప్రధాన కారణం పారిశ్రామిక, పునరుత్పాదక ఇంధన రంగాలలో దాని విస్తృత వినియోగం.

ఉక్కు రక్షణ: తుప్పు పట్టకుండా ఉక్కును రక్షించడంలో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ పరిశ్రమలో ఉపయోగించే 90-95 శాతం ఉక్కు గాల్వనైజ్ చేయబడుతోంది. కానీ భారత్‌లో ఇది కేవలం 23 శాతం మాత్రమే ఉంది. ఈ శాతం పెరిగే కొద్దీ జింక్ డిమాండ్ కూడా పెరుగుతుంది.

పునరుత్పాదక ఇంధనం: సౌర, పవన శక్తి రంగాలలో జింక్ డిమాండ్ విపరీతంగా పెరగనుంది. రాబోయే సంవత్సరాల్లో సౌరశక్తి కోసం జింక్ అవసరాలు 43 శాతం పెరుగుతాయని.. పవన శక్తిలో జింక్ వినియోగం 2030 నాటికి రెట్టింపు అవుతుందని అంచనా.

భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాలు, హరిత ఇంధన రంగాల విస్తరణకు జింక్ అవసరం తప్పనిసరి. ఈ కారణాలన్నీ జింక్‌ను త్వరలో బంగారం వంటి విలువైన లోహాల జాబితాలో చేర్చడానికి దోహదపడతాయని విశ్లేషకులు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..