
ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ఆర్థికంగా మేల్కొల్పిన రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి గ్లోబల్ ఎకానమీ, కరెన్సీలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరెన్సీ కేవలం భ్రమ అని, అది నకిలీ డబ్బుతో సమానమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు ముద్రించే డాలర్లు, ఇతర కరెన్సీలపై నమ్మకం లేకే తాను జీవితాంతం బంగారం, వెండిని కొనుగోలు చేస్తూ వస్తున్నానని స్పష్టం చేశారు. ఇటీవల ఆయన చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు పెట్టుబడిదారుల్లో హాట్ టాపిక్‌గా మారింది. చాలామంది బంగారం కొంటే రాత్రికి రాత్రే లాభాలు వచ్చేస్తాయని, డబ్బు సంపాదించవచ్చని భావిస్తారని.. కానీ ధనవంతులు ఆ ఉద్దేశంతో బంగారం కొనరని కియోసాకి తెలిపారు. ‘‘నేను నా జీవితమంతా బంగారం, వెండి నిల్వ చేసుకుంటూ వచ్చాను. వాటి ధరలు ఎప్పుడో భారీగా పెరుగుతాయని ఆశించి నేను ఈ నిర్ణయం తీసుకోలేదు. కేవలం అమెరికా డాలర్ విలువ కాలక్రమేణా ఘోరంగా పడిపోతుందనే అవగాహనతోనే ఈ పని చేశాను. ప్రభుత్వాలపై నమ్మకం ఉంచాలా, లేక వేల ఏళ్ల చరిత్ర ఉన్న బంగారంపై విశ్వాసం పెంచుకోవాలా అనేది ఎవరికి వారు తేల్చుకోవాలి’’ అని కియోసాకి స్పష్టం చేశారు.
ఆర్థిక చరిత్రను ప్రస్తావిస్తూ కియోసాకి ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేశారు. 1971లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ గ్లోబల్ ఎకానమీలో గోల్డ్ స్టాండర్డ్ విధానాన్ని రద్దు చేశారు. ఆ తర్వాత నుంచే అమెరికా డాలర్ క్రమంగా తన నిజమైన విలువను కోల్పోతూ వస్తోందని ఆయన విశ్లేషించారు. ప్రభుత్వాలు తమ ఇష్టానుసారంగా కొత్త కరెన్సీని ముద్రించిన ప్రతిసారీ, మార్కెట్లో ఉన్న నగదు కొనుగోలు శక్తి దారుణంగా పడిపోతుందని, దీనినే సామాన్యుడు ద్రవ్యోల్బణం రూపంలో అనుభవిస్తాడని ఆయన హెచ్చరించారు.
కియోసాకి విశ్లేషణ ప్రకారం.. బంగారం అనేది కేవలం లాభాలను ఇచ్చే గ్యారెంటీ సాధనం కాదు, అది మీ సంపదను అంతరించిపోకుండా కాపాడే ఒక బలమైన రక్షణ కవచం.
సామాన్యుల తప్పు: ఎక్కువ మంది ప్రజలు సోషల్ మీడియాలో టైమ్ వేస్ట్ చేస్తూ, తదుపరి స్టాక్ మార్కెట్ టిప్ కోసం ఎదురుచూస్తుంటారు. లేదా ప్రభుత్వం తమను కాపాడుతుందని ఆశగా ఉంటారు.
రిచ్ డాడ్ సూత్రం: సంపదను రక్షించుకోవడానికి కోట్లాది రూపాయలు అవసరం లేదు. ఒక చిన్న వెండి నాణెం లేదా గ్రాము బంగారం కొనుగోలు చేయడం ద్వారా కూడా సామాన్యులు తమ సంపద రక్షణను ప్రారంభించవచ్చు.