Paytm షేర్లు దాని ఇష్యూ ధర నుంచి 68 శాతం మేర పతనమయ్యాయి. అంటే మీరు Paytm IPOలో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే.. ప్రస్తుతం దాని విలువ కేవలం 32 వేల రూపాయలకు పడిపోయింది. ఇదే సమయంలో స్టార్టప్ టెక్ కంపెనీలైన Zomato, PolicyBazar, Naykaa షేర్ల ధరలు కూడా వాటి 52 వారాల కనిష్ఠానికి దగ్గరగా ఉన్నాయి. ఈ టెక్ స్టార్టప్‌లలో పతనం మొత్తం మార్కెట్ కంటే ఎక్కువగాను ఉంది. ఈ స్టార్టప్ కంపెనీల షేర్ల పతనం నుంచి ఇన్వెస్టర్లు పాఠాలు నేర్చుకున్నారో లేదో కానీ.. షేర్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మాత్రం దీని నుంచి చాలా గమనించింది. అందుకే IPOల వాల్యుయేషన్‌లకు సంబంధించిన కొత్త నిబంధనలను SEBI పరిశీలిస్తోంది.
ఇకపై టెక్ స్టార్టప్‌లు వాల్యుయేషన్ కోసం ఉపయోగించే ఇంటర్నల్ బిజినెస్ మెట్రిక్‌లను కూడా ఇవ్వవలసి ఉంటుందని సెబీ స్పష్టం చేసింది. స్టార్టప్‌లు తమ మొబైల్ అప్లికేషన్ల డౌన్‌లోడ్ వివరాలు, యాక్టివ్ యూజర్ల సంఖ్య, యాప్ కోసం వెచ్చిస్తున్న సమయం వంటి వివరాలను అందించాల్సి ఉంటుంది. ఈ విషయాలన్నీ వాల్యుయేషన్‌తో అనుసంధానించాలి. ఎందుకంటే.. నష్టాల్లో ఉన్న ఈ స్టార్టప్‌లు ఇతర కంపెనీల మాదిరిగానే తమ ఆర్థిక స్థితిగతులను అందజేస్తే.. పెట్టుబడిదారులకు కంపెనీ గురించి స్పష్టమైన అభిప్రాయం ఏర్పడుతుందని SEBI అభిప్రాయపడుతోంది. Paytm షేర్ ఫ్లాప్ లిస్టింగ్ తర్వాత SEBI పై చాలా విమర్శలు వచ్చాయి. ఐపీఓల వ్యాల్యుయేషన్ ఎసెస్‌మెంట్ విషయంలో SEBI కి అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. నష్టాలను మూటగట్టుకుంటున్న ఈ స్టార్టప్‌ల ఐపీఓలు ఖరీదైన వాల్యుయేషన్ల కారణంగానే జరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. వీటన్నింటిపై ఆందోళనలను ఉటంకిస్తూ సెబీ డిస్క్లోజర్ నిబంధనలను కఠినతరం చేసింది. ఇందుకోసం మార్చి 5లోగా వాటాదారులందరూ తమ సలహాలను అందించాలని సెబీ కోరింది.
సెబీకి తమ ప్రాస్పెక్టస్‌ను సమర్పించిన స్టార్టప్‌లు ఇప్పుడు మరింత సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. నాన్-ఫైనాన్షియల్ మెట్రిక్‌లను ఆడిట్ చేయవలసిందేనని సెబీ ఈ స్టార్టప్‌లను కోరింది. వాల్యుయేషన్ మెట్రిక్‌ల గురించి వివరంగా తెలియజేయాలని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లను కూడా కోరింది. రాబోయే స్టార్టప్ IPOల విషయంలో సెబీ కొత్త నిబంధనల కారణంగా కొంత ఆలస్యం కావచ్చు. తాజా నియమాలు తమపై అదనపు భారాన్ని మోపునున్నట్లు కొన్ని స్టార్టప్‌లు చెబుతున్నాయి. కంపెనీల ఐపీఓ వాల్యుయేషన్‌పై సెబీ ఎటువంటి పరిమితిని నిర్ణయించడం లేదని ప్రాఫిట్ మార్ట్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అవినాష్ గోరక్షర్ అన్నారు.
లాభదాయకమైన, నష్టాల్లో ఉన్న కంపెనీల కోసం అన్ని ప్రయత్నాలూ ఒక స్థాయి ప్లేయింగ్ ఫీల్డ్‌ను రూపొందించడమేనని ఆయన అంటున్నారు. మార్కెట్, పెట్టుబడిదారుల దృక్కోణంలో ఇది మంచిదేనని తెలుస్తోంది. త్వరలో IPO కోసం సిద్ధమవుతున్న తమ స్టార్టప్ సెబీ కొత్త నిబంధనలతో.. కంపెనీ ఆందోళన చెందుతోందని ఆ కంపెనీకి చెందిన అధికారి ఒకరు పేర్కొన్నారు. నిబంధనలు కఠినతరం కానున్నందున స్టార్టప్ కంపెనీలు నిబంధనలు తక్కువగా ఉండే విదేశీ మార్కెట్లలో తమ కంపెనీ షేర్లను లిస్టింగ్ చేయాలని ఆలోచించవచ్చు. హాంగ్-కాంగ్ లాంటి పెద్ద మార్కెట్‌లో రెగ్యులేటింగ్ సంస్థలు కంపెనీల వ్యాపార పద్ధతులు, వాటి ఆర్థిక విషయాల్లో కఠినమైన నియమాలను అనుసరిస్తాయి. అయితే.. ఏ రెగ్యులేటర్ కూడా వాల్యుయేషన్ మెట్రిక్‌లను అంత లోతుగా గమనించదు. ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే కాలంలో.. స్టార్టప్‌లు మార్కెట్లో లిస్టింగ్ కావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చని అర్థమవుతోంది. ఇకపై లిస్టింగ్ ఆలస్యం అయినప్పటికీ.. అది మరింత మెరుగ్గా ఉండనుంది.
Read Also.. Maggi: బ్యాచిలర్స్‌కు బ్యాడ్ న్యూస్.. మీ ఆకలి తీరాలంటే మరింత భారం భరించాల్సిందే..