స్టాక్‌మార్కెట్‌ కుదుపు.. తగ్గిపోయిన పొదుపు.. సంక్షోభంలో భారత మార్కెట్‌..

|

Jan 22, 2025 | 10:00 PM

సేవింగ్స్‌. ఎప్పుడో విన్నట్లుంది కదూ. దాన్ని మర్చిపోయి చాలా కాలమైంది కదూ. నెలాఖరుకి అప్పోసప్పో చేయాల్సిందే. క్రెడిట్‌ కార్డు బయటికి తీయాల్సిందే. ఇక సేవింగ్స్‌ ఎక్కడ? జేబుల్లో క్యాష్‌ సంగతి తర్వాత ఎటుచూసినా డేంజర్‌బెల్స్‌. స్టాక్‌ మార్కెట్‌ బేర్‌మంటోంది. రియల్‌ ఎస్టేట్‌ చూస్తే ఢమాల్‌. రూపాయి మారాంచేసే పాపాయిలా గుక్కపెట్టి ఏడుస్తోంది. ఇన్ని అపశకునాల మధ్య ఇక బంగారంమీద మీద పెట్టడానికి పెట్టుబడులు పుట్టేదెక్కడ? చావుకబురు చల్లగా చెబుతున్నా తెలుగురాష్ట్రాలే కాదు.. దేశమంతా ఇదే సీన్‌.

స్టాక్‌మార్కెట్‌ కుదుపు.. తగ్గిపోయిన పొదుపు.. సంక్షోభంలో భారత మార్కెట్‌..
Follow us on

సునామీలా ముంచేస్తోంది ఆర్థిక సంక్షోభం. ట్రంప్‌ అడుగుపెట్టిన వేళావిశేషం.. భల్లూకపు కౌగిట్లో నలిగిపోతోంది మన మార్కెట్‌. రియల్‌ఎస్టేట్‌ ఈగలు తోలుకుంటోంది. బడ్జెట్‌ తర్వాత చూద్దామన్నట్లు కస్టమర్లు కూడా వెయిటింగ్‌. ఇక బంగారం రేటు భగ్గుమంటుంటే.. పెట్టుబడులు పెట్టేవారు లేక బులియన్‌ మార్కెట్‌ కూడా కళతప్పుతోంది. ఇక డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో క్షీణిస్తోంది మన రూపాయి. ఇన్ని ప్రతికూలతలుంటే అప్పుచేసయినా పప్పుకూడు తినాలనే మన సమాజంలో ఇక సేవింగ్స్‌కి ఛాన్స్‌ ఎక్కడుంది?

మదుపరులను ఎడాపెడా వాయించేస్తోంది స్టాక్‌మార్కెట్‌. ఆ మధ్య వరుస సెషన్లలో రోజూ లక్షలకోట్ల నష్టాలు. 52వారాల్లో దాదాపు 86వేల గరిష్టస్థాయిని అందుకున్న సెన్సెక్స్‌ కొత్త సంవత్సరంలో 76వేల దరిదాపుల్లోకి వచ్చేసింది. అంటే ఆర్నెల్లలోనే 10వేల పాయింట్లు ఢమాల్‌. ట్రంప్‌ గద్దెనెక్కిన మర్నాడు ఏడునెలల కనిష్ఠానికి పడిపోయింది సెన్సెక్స్‌. ఏడున్నర లక్షల కోట్ల మదుపరుల సంపద మటాష్‌. అమెరికా సుంకాల భయానికి తోడు నెగిటివ్‌ ట్రెండ్‌తో స్టాక్‌మార్కెట్‌లో ఎటుచూసినా హాహాకారాలు. ఈ ఊచకోత బుధవారం కూడా కొనసాగుతుందనుకుంటే గుడ్డిలో మెల్లలా చివర్లో కాస్త కుదుటపడింది.

మాయాజూదంలా మారిపోయింది మన స్టాక్‌మార్కెట్‌. చీమ చిటుక్కుమన్నా మార్కెట్‌లో భూకంపమొచ్చినట్లు ఊగిపోతోంది. ఆమధ్య కొత్త వైరస్‌ వార్తలొచ్చాయో లేదో కొన్నిరోజులు పడుతూనే ఉంది. కేవలం ఇండియాలోనేనా, మిగతా దేశాల్లో కూడా అలాగే ఉందా అంటే అమెరికా తప్ప అందరి పరిస్థితీ తుమ్మితే ఊడే ముక్కులాగే ఉంది. కొన్ని దేశాలను మాంద్యం భయం వెంటాడుతోంది. మిడిల్ ఈస్ట్‌లో జియోపాలిటిక్స్ ప్రమాదకరంగా మారాయి. ఈ భయాలన్నీ ప్రస్తుతం ఆసియా మార్కెట్లను దెబ్బతీస్తున్నాయి. ఈమధ్య జపాన్‌ నిక్కీ 225 ఇండెక్స్‌ ఏకంగా 13 శాతం క్రాష్ అయి ఏడ్నెల్ల కనిష్ఠానికి పడిపోయింది. తైవాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, హాంకాంగ్, షాంఘై అన్ని స్టాక్ మార్కెట్లకు ఇలాంటి అనుభవాలున్నాయి. మన మార్కెట్‌ రికవరీ అవుతుందా? మళ్లీ లాభాల బాట పడుతుందా అంటే కొందరు ఎస్‌ అంటున్నా.. మదుపరులకు ధైర్యం సరిపోవడంలేదు. జనవరిలో భారతీయ స్టాక్‌ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడిదారులు 44వేల396 కోట్లను ఉపసంహరించుకున్నారు. త్రైమాసిక ఫలితాలు కూడా మార్కెట్‌లో కుదుపులకు కారణమయ్యాయి. ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారత ఈక్విటీల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పటికే 58 వేల కోట్లదాకా ఉపసంహరించుకున్నారు. డాలర్ విలువ బలపడటం, బాండ్ ఈల్ట్స్ పెరుగుతుండటంతో అమెరికా మార్కెట్ వైపు చూస్తున్నారు ఫారిన్‌ ఇన్వెస్టర్లు.

పసిడి మార్కెట్‌ అన్నా పచ్చగా ఉందా అంటే.. గోల్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ తగ్గిపోతున్నాయి. పెరుగుట పెరుగుటకొరకే అన్నట్లు దూసుకుపోతోంది బంగారం రేటు. చూస్తుంటే తులం బంగారం రేటు లక్షయ్యేలా ఉంది. ఇప్పట్లో పసిడి సామాన్యులకు అందుబాటు వచ్చే పరిస్థితులు కనిపించటం లేదు. ట్రంప్ గెలవగానే తగ్గుముఖం పట్టిన బంగారం.. ఆయన ప్రమాణస్వీకారం తర్వాత కూడా భారీ ర్యాలీ కొనసాగిస్తోంది. ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయాలతో డాలర్‌ బలపడటంతో.. బంగారం ధరలు తగ్గొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. పెట్టుబడికన్నా అలంకరణకే పసిడిని వినియోగిస్తాం మనం. దీంతో రేటు తగ్గినప్పుడు చూసుకుందామనో, ఉన్న బడ్జెట్‌తో వచ్చినంతే కొందామనే ధోరణి కూడా గోల్డ్‌మార్కెట్‌ని ప్రభావితం చేస్తోంది.

సర్లే.. ఎన్నో అనుకుంటుంటాం. అన్నీ అవుతాయా ఏంటీ అనుకుంటే.. పోనీ రియల్‌ ఎస్టేట్‌ అయినా రొమ్మువిరుచుకుని నిలబడిందా అంటే అదీ సోసోనే. క్యాలెండర్ ఇయర్‌ 2024 చివరి త్రైమాసికంలో దేశంలోని 8 పెద్ద నగరాల్లో ఇళ్ల విక్రయాలో ఏకంగా 26 శాతం క్షీణత కనిపించింది. ఈ కాలంలో కొత్త ఇళ్ల లాంచింగ్‌లో కూడా 33శాతం క్షీణత కనిపించింది. డిజిటల్ రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ అండ్ అడ్వైజరీ రిపోర్ట్‌ రిపోర్ట్ ప్రకారం నేషనల్ క్యాపిటల్ రీజియన్ మినహా, ఇతర నగరాల్లో ఇళ్ల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఇదే కాలంలో ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో అమ్మకాలు 50 శాతం పెరిగాయి. హోమ్ లోన్స్ వడ్డీ రేట్లు పెరగడం, ఇల్లు కొనుగోలు చేస్తే వచ్చే పన్ను మినహాయింపులు పరిమితంగానే ఉండటం, ఆదాయంలో అత్యధికం కుటుంబ ఖర్చులకే సరిపోవడం వంటి కారణాలతో ఇళ్లు కొనేవారు తగ్గిపోయారు. పెరుగుతున్న ప్రాపర్టీ ధరలతో వెయిట్‌ అండ్‌ సీ అన్నట్లున్నారు కొనుగోలుదారులు.

పోపులగిన్నె నుంచి పోస్టాఫీస్ సేవింగ్స్‌దాకా ఒకప్పుడు పొదుపు అలవాటు ఉండేది. ఆధునిక జీవితంలో దాచుకోవడం అనేది బాగా తగ్గిపోయింది. పొదుపు తగ్గించుకుని రాజీపడకుండా ఖర్చు చేయడానికే అంతా మొగ్గు చూపుతున్నారు. దీంతో కొన్నాళ్లుగా దేశీయ పొదుపు రేటు తగ్గుతూ వస్తోంది. అంతర్జాతీయంగా పొదుపు రేటులో గతంలో 2, 3 స్థానాల్లో నిలుస్తూ వచ్చిన దేశం ఇప్పుడు నాలుగో స్థానంలో ఉంది. 2023–24 సంవత్సరానికి దేశ జీడీపీలో పొదుపు రేటు 30.2 శాతానికి పడిపోయింది. 2011–12లో దేశ పొదుపు రేటు అత్యధికంగా 34శాతంగా నమోదైంది. భవిష్యత్తులో ఈ పొదుపు రేటు మరింత తగ్గే అవకాశం ఉందని ఆర్థిక వేత్తల అంచనా. అయితే అంతర్జాతీయ సగటు పొదుపు రేటు 28.2 శాతంతో పోలిస్తే మనమే ఆ మాత్రం పొదుపు చేస్తున్నామని ఆనందపడటమే!

చరిత్రలో అత్యంత కనిష్ఠానికి రూపాయి విలువ పడిపోవడం మరో ఆందోళనకర పరిణామం. యూఎస్​డాలర్‌తో పోలిస్తే రూపీ హిస్టరీలోనే ఫస్ట్‌ టైమ్‌ 86.62 కనిష్ఠానికి చేరుకుంది. ఒకేసారి రూపాయి విలువ 58 పైసలు పడిపోవడం ఇదే తొలిసారి. అమెరికన్ డాలర్​ బలపడటం, ముడి చమురు ధరలు పెరగడం రూపాయి పతనానికి దారితీసింది. ట్రంప్‌ దెబ్బకి మన రూపీకి ఇప్పట్లో బీపీ కంట్రోల్‌ అయ్యేలా కనిపించడంలేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి