
నేపాల్‌లో సోషల్ మీడియా యాప్స్‌పై బ్యాన్ విధించడంతో మొదలైన వివాదం.. దేశంలో అవినీతి వ్యతిరేక పోరాటంగా మారింది. జెనరేషన్ జెడ్ యువత ఈ ఉద్యమాన్ని ఉధృతంగా నడిపించారు. ఏకంగా ఆ దేశ పార్లమెంట్‌కే నిప్పుపెట్టారు. ఈ పోరాటానికి భయపడి.. ఆ దేశ ప్రధాని కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.
రాజధాని ఖాట్మండుతో పాటు దేశవ్యాప్తంగా భారీ హింసాకాండ మధ్య మంగళవారం ప్రధానమంత్రి కె.పి.శర్మ ఓలి, కీలక క్యాబినెట్ మంత్రులు రాజీనామా చేసినప్పటి నుండి దేశం తీవ్ర రాజకీయ సంక్షోభంలో పడింది. నిరసనకారులు నాయకుడి ప్రైవేట్ ఇంటికి నిప్పంటించి, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా, విదేశాంగ మంత్రి అర్జూ రాణా దేవుబా, ఇతర మాజీ మంత్రుల నివాసాలపై దాడి చేశారు. సోషల్ మీడియా సైట్లపై ప్రభుత్వ నిషేధానికి వ్యతిరేకంగా జనరేషన్ జెడ్ ఆందోళనగా పిలువబడే యువకుల నిరసనలు సోమవారం నేపాల్‌ను కుదిపేశాయి, పోలీసులు బలప్రయోగం చేయడంతో 19 మంది మరణించారు. 300 మందికి పైగా గాయపడ్డారు.
అంతర్జాతీయ సమాజం ఇప్పుడు నేపాల్‌లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. ప్రస్తుతం నేపాల్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే భారత రూపాయిని నేపాల్ కరెన్సీగా మార్చడంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే నేపాల్‌లో రూ.100 విలువ ఎంత? నేపాల్ అధికారిక కరెన్సీ నేపాల్ రూపాయి (NPR), మారకం రేటు ప్రతిరోజూ మారవచ్చు.
సెప్టెంబర్ 10 నాటికి భారతీయ ఒక్క రూపాయి దాదాపు 1.61 నేపాలీ రూపాయిలకు సమానం. అంటే 100 రూపాయల విలువ దాదాపు 161 NPR అవుతుంది. సాధారణంగా రూ.100, రూ.200 నోట్లు ఆమోదించినా, రూ.500 వంటి పెద్ద డినామినేషన్లు ఆమోదించకపోవచ్చు. ముఖ్యంగా సరిహద్దు పట్టణాలు, పర్యాటక ప్రదేశాలలో భారతీయ కరెన్సీ విస్తృతంగా ఆమోదం పొందుతోంది. కొన్ని ప్రాంతాలలో డెబిట్ కార్డులను కూడా ఉపయోగించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి