Credit Card Debt: RBI గైడ్‌లైన్స్.. క్రెడిట్ కార్డ్ బకాయిలు ఉండగా వ్యక్తి మరణిస్తే బ్యాంకు ఏం చేస్తుంది?

క్రెడిట్ కార్డ్ అనేది అవసరానికి ఆసరాగా నిలుస్తోంది. కానీ, ఒకవేళ క్రెడిట్ కార్డ్ వినియోగదారుడు అకస్మాత్తుగా మరణిస్తే, అతను వాడిన బిల్లు లేదా తీసుకున్న EMIల పరిస్థితి ఏంటి? ఆ అప్పును కుటుంబ సభ్యులు తీర్చాలా లేదా బ్యాంకు ఆ రుణాన్ని మాఫీ చేస్తుందా? దీనిపై చాలా మందిలో అనేక సందేహాలు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం, ఈ విషయంలో కొన్ని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. కార్డుదారుడు మరణిస్తే బ్యాంకు ఆ అప్పును ఎలా వసూలు చేస్తుంది, కుటుంబ సభ్యులకు ఉండే హక్కులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Credit Card Debt: RBI గైడ్‌లైన్స్.. క్రెడిట్ కార్డ్ బకాయిలు ఉండగా వ్యక్తి మరణిస్తే బ్యాంకు ఏం చేస్తుంది?
Credit Card Debt

Updated on: Jan 26, 2026 | 8:08 PM

క్రెడిట్ కార్డ్ అనేది ప్రాథమికంగా ఒక ‘అన్‌సెక్యూర్డ్ లోన్’ (Unsecured Loan). అంటే ఈ కార్డ్ ఇచ్చేటప్పుడు బ్యాంకు ఎటువంటి ఆస్తులను (బంగారం, భూమి లేదా ఇల్లు) తాకట్టు పెట్టుకోదు. కేవలం వ్యక్తి ఆదాయం, క్రెడిట్ స్కోర్‌ను బట్టి మాత్రమే కార్డు జారీ చేస్తారు. అందుకే, వ్యక్తి మరణించినప్పుడు ఆ అప్పుకు అతనే బాధ్యుడు తప్ప, కుటుంబ సభ్యులు తమ వ్యక్తిగత ఆస్తుల నుండి చెల్లించాల్సిన అవసరం లేదని చట్టం చెబుతోంది. అయితే, దీని వెనుక కొన్ని నిబంధనలు మరియు మినహాయింపులు కూడా ఉన్నాయి. ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి.

RBI నిబంధనలు, రికవరీ పద్ధతులు:

వారసుల బాధ్యత: కార్డుదారుడు మరణిస్తే, బ్యాంకు అతని కుటుంబ సభ్యులను లేదా వారసులను అప్పు కట్టమని బలవంతం చేయకూడదు. అయితే, మరణించిన వ్యక్తి పేరిట ఏవైనా ఆస్తులు (బ్యాంక్ అకౌంట్, ఎఫ్‌డీలు, షేర్లు, బంగారం) ఉంటే, బ్యాంకు వాటి నుండి బకాయిలను రికవరీ చేసుకుంటుంది.

వారసత్వ ఆస్తుల పరిమితి: ఒకవేళ వారసుడికి మరణించిన వ్యక్తి నుండి కొంత ఆస్తి వస్తే, ఆ ఆస్తి విలువ మేరకు మాత్రమే బ్యాంకు అప్పు వసూలు చేయగలదు. ఉదాహరణకు, వారసత్వంగా రూ. 5 లక్షలు వచ్చి, అప్పు రూ. 7 లక్షలు ఉంటే.. వారసుడు రూ. 5 లక్షలు మాత్రమే చెల్లించాలి. మిగిలిన రూ. 2 లక్షలు బ్యాంకు మాఫీ చేయాల్సిందే.

ఆస్తులు లేకపోతే?: మరణించిన వ్యక్తి పేరిట ఎటువంటి ఆస్తులు లేకపోతే, ఆ అప్పును బ్యాంకు ‘బ్యాడ్ లోన్’ (NPA) గా పరిగణించి రద్దు చేస్తుంది.

జాయింట్ కార్డ్ & గ్యారంటర్: కార్డ్ జాయింట్‌గా ఉంటే లేదా ఎవరైనా గ్యారంటర్‌గా సంతకం చేసి ఉంటే, ఒకరు మరణించినా రెండవ వ్యక్తి ఆ అప్పు తీర్చాల్సి ఉంటుంది.

ఇన్సూరెన్స్ కవర్: కొన్ని ప్రీమియం కార్డులకు ‘క్రెడిట్ లైఫ్ ఇన్సూరెన్స్’ ఉంటుంది. అటువంటి సందర్భంలో ప్రమాదవశాత్తు కార్డుదారుడు మరణిస్తే ఇన్సూరెన్స్ కంపెనీయే ఆ బిల్లును చెల్లిస్తుంది.

కుటుంబ సభ్యులు చేయాల్సిన పనులు:
కార్డుదారుడు మరణించిన వెంటనే ఆ విషయాన్ని బ్యాంకుకు తెలియజేయాలి. దీనివల్ల వడ్డీ మరియు జరిమానాలు పెరగకుండా ఉంటాయి.

మరణ ధృవీకరణ పత్రం (Death Certificate) అందజేసి కార్డును బ్లాక్ చేయించాలి.

రికవరీ ఏజెంట్లు వచ్చి బెదిరిస్తే పోలీసులకు లేదా RBI లోక్‌పాల్‌ (Ombudsman) కు ఫిర్యాదు చేయవచ్చు.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. మరిన్ని వివరాల కోసం మీ బ్యాంకును లేదా ఆర్థిక నిపుణుడిని సంప్రదించండి.