Hyundai motor india: ఆ కార్ల ఎగుమతుల్లో మనమే కింగ్.. భారత్ నుంచి ప్రపంచవ్యాప్తంగా సరఫరా..!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ కంపెనీకి మార్కెట్ లో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అనే దేశాల్లో ఈ కార్లకు ఎంతో డిమాండ్ ఉంది. దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ సంస్థ మన దేశంలోని ప్రవేశించి 25 ఏళ్లు పూర్తయ్యింది. ఇక్కడ హ్యుందాయ్ మోటార్ ఇండియా పేరుతో కార్లను తయారు చేస్తోంది.

Hyundai motor india: ఆ కార్ల ఎగుమతుల్లో మనమే కింగ్.. భారత్ నుంచి ప్రపంచవ్యాప్తంగా సరఫరా..!
Cars Export

Updated on: Feb 16, 2025 | 6:33 PM

భారత దేశంలో 1999లో మొదలైన హ్యుందాయ్ ప్రస్థానం నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది. ఇక్కడి నుంచి దాదాపు 60 దేశాలకు కార్లను ఎగుమతి చేస్తోంది. ఇలా ఇప్పటి వరకూ 3.7 మిలియన్లకు పైగా కార్లను రవాణా చేసింది. హ్యుందాయ్ కార్లకు ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులు ఉన్నారు. ఆధునిక టెక్నాలజీ, లేటెస్ట్ ఫీచర్లు, అనుకూల ధర కలిగిన ఈ కార్ల విక్రయాలు మార్కెట్ లో జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఐ10 విభాగంలోని ఐ10, గ్రాండ్ ఐ10, గ్రాండ్ ఐ10 నియోస్ కార్లు మన దేశం నుంచి దాదాపు 1.5 మిలియన్ల యూనిట్లకు పైగా ఎగుమతి అయ్యాయి. అలాగే వెర్నా, వెర్నా ట్రాన్స్ ఫార్మ్, ఫ్లూడిక్ తదితర వెర్నా విభాగానికి చెందిన 5 లక్షల యూనిట్లు తయారయ్యాయి. 2024లో ఎక్స్ టర్ మైక్రో ఎస్ యూవీ ఎగుమతులను కంపెనీ ప్రారంభించింది. క్రెటా, అల్కాజార్, వెర్నా, ఎక్స్ టర్, ఐ10 తదితర అనేక మోడళ్లు ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.

సుమారు 25 ఏళ్లలో భారత్ నుంచి దాదాపు 150కి పైగా దేశాలకు కార్లను సరఫరా చేసినట్టు హ్యుందాయ్ కంపెనీ తెలిపింది. ఈ సంస్థకు తమిళనాడులో తయారీ కేంద్రాలు ఉన్నాయి. దక్షిణ కొరియా వెలువల ఈ కంపెనీకి అతి పెద్ద ఎగుమతి దారుగా మన దేశం మారింది. ఇటీవలే దక్షిణాఫ్రికాకు ఎక్స్ టర్ మోడల్ ఎగుమతులు మొదలయ్యాయి. అక్కడి మార్కెట్ లో భారత్ తయారు చేసిన ఎనిమిదో వాహనంగా ఎక్స్ టర్ గుర్తింపు పొందింది. భారత దేశం నుంచి ప్రయాణికుల వాహనాలను ఎగుమతి చేసే అతి పెద్ద సంస్థగా హ్యుందాయ్ మోటారు ఇండియా నిలిచింది. గత 25 ఏళ్లలో 3.7 మిలియన్ యూనిట్లకు పైగా ఎగుమతి చేసి, మన దేశానికి గణనీయమైన ఫారెక్స్ ను సంపాదించి పెట్టింది. అలాగే ప్రపంచ పటంలో మన దేశానికి మంచి గుర్తింపును తీసుకువచ్చింది.

2024లో హ్యుందాయ్ 1,58,686 వాహనాలను ఎగుమతి చేసినట్టు కంపెనీ తెలిపింది. అలాగే ఆఫ్రికాకు ఒక మిలియన్ వాహనాలను ఎగుమతి చేయడం ద్వారా మైలురాయిని సాధించింది. భారతీయ ఇంజినీరింగ్ పై ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న నమ్మకానికి చిరునామాగా మారింది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ), ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్సరింగ్ ఆఫ్ హైబ్రీడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఎఫ్ఏఎంఐ) పథకాలు మన దేశంలో వాహనాల ఉత్పత్తి, ఎగుమతుల్లో పెట్టుబడులకు ప్రోత్సాహం అందజేశాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి