
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసి డిజిటల్ లావాదేవీలే. పది రూపాయలైనా, లక్ష రూపాయలైనా యూపీఐ ద్వారా చెల్లించడం కామన్‌గా మారింది. యూపీఐ పేమెంట్స్‌లో ప్రపంచానికే భారత్ ఆదర్శంగా నిలుస్తోంది. సాధారణంగా రోజుకు రూ.లక్ష వరకే పరిమితమైన యూపీఐ లావాదేవీలకు ఇప్పుడు లిమిట్ పరిమితి పెరిగింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో పన్నులు, బీమా ప్రీమియంలు, లోన్ ఈఎంఐలు, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు వంటి ముఖ్యమైన చెల్లింపులు ఇప్పుడు మరింత సులభం కానున్నాయి.
సెప్టెంబర్ 15 నుంచి కొన్ని రకాల లావాదేవీలకు ఒకేసారి రూ. 5 లక్షల వరకు, అలాగే రోజుకు రూ. 10 లక్షల వరకు చెల్లించుకునే అవకాశం లభించింది. ఈ మార్పు ఈ ఆర్థిక సంవత్సరం పన్ను చెల్లింపుల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ఎంతగానో ఉపకరిస్తుంది. ఇంతకుముందు పరిమితి వల్ల ఒకేసారి పెద్ద మొత్తంలో పన్నులు చెల్లించలేని వారికి ఇది పెద్ద ఉపశమనం.
ఈ కొత్త నిబంధన కేవలం పర్సన్ టు మర్చంట్ అంటే, వ్యక్తి నుంచి వ్యాపారికి చేసే చెల్లింపులకు మాత్రమే వర్తిస్తుంది. ఇది పర్సన్ టు పర్సన్ అంటే ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి పంపే సాధారణ యూపీఐ లావాదేవీలకు వర్తించదు. పర్సన్ టు పర్సన్ లావాదేవీలకు పాత పరిమితి అయిన రూ. 1 లక్ష అలాగే కొనసాగుతుంది.
పన్ను చెల్లింపులు: ఇప్పుడు ఒకేసారి రూ. 5 లక్షలు, రోజుకు గరిష్టంగా రూ. 10 లక్షలు చెల్లించవచ్చు.
బీమా – క్యాపిటల్ మార్కెట్: ఈ లావాదేవీలకు గతంలో రూ. 2 లక్షలు ఉన్న పరిమితి ఇప్పుడు రూ. 5 లక్షలకు పెరిగింది. రోజుకు రూ. 10 లక్షల వరకు చెల్లించవచ్చు.
రుణ ఈఎంఐ, బీ2బీ వసూళ్లు: వీటికి కూడా ఇప్పుడు లావాదేవీకి రూ. 5 లక్షలు, రోజుకు రూ. 10 లక్షల పరిమితి వర్తిస్తుంది.
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులు: గతంలో రూ. 2 లక్షలు ఉన్న పరిమితి ఇప్పుడు లావాదేవీకి రూ. 5 లక్షలు, రోజుకు గరిష్టంగా రూ. 6 లక్షలకు పెరిగింది.
విదేశీ కరెన్సీ: విదేశీ కరెన్సీ కొనుగోలు, అమ్మకాలకు కూడా రూ. 5 లక్షల పరిమితి వర్తిస్తుంది.
డిజిటల్ ఖాతా – ఎఫ్‌డీ: డిజిటల్ సేవింగ్స్ ఖాతా తెరవడం, ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడం వంటి వాటికి రూ. 5 లక్షల వరకు లావాదేవీల పరిమితి అనుమతించబడింది.
ఎన్‌పీసీఐ ఈ కొత్త పరిమితిని అన్ని బ్యాంకులు, యాప్‌లు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు వర్తింపజేయనుంది. అయినప్పటికీ బ్యాంకులు తమ అంతర్గత భద్రతా విధానాల ప్రకారం ఈ పరిమితులను స్వయంగా నిర్ణయించుకునే స్వేచ్ఛను కలిగి ఉన్నాయి. అందువల్ల అన్ని బ్యాంకులు ఈ కొత్త పరిమితులను ఒకేసారి అమలు చేయకపోవచ్చు. కానీ చాలావరకు సెప్టెంబర్ 15 నుంచి దీన్ని అమలు చేస్తాయని భావిస్తున్నారు.
ఈ మార్పుతో ముఖ్యంగా పన్నులు, బీమా, పెట్టుబడులు వంటి వాటి కోసం పెద్ద మొత్తంలో చెల్లింపులు చేసే వ్యాపారవేత్తలకు, నిపుణులకు, సాధారణ వినియోగదారులకు కూడా గణనీయమైన ప్రయోజనం చేకూరనుంది. అయితే IPO లావాదేవీలకు మాత్రం పాత రూ. 5 లక్షల పరిమితి అలాగే కొనసాగుతుందని గమనించాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..