Union Budget 2023: ప్రైవేటు కంపెనీలు ఉద్యోగాల్లోంచి తీయకూడదని నిబంధన పెట్టలేదా? నిర్మలమ్మకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి లేఖ
ఇప్పుడు అందరి చూపు బడ్జెట్ 2023పైనే ఉంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌పై కోటి ఆశలు పెంచుకున్నారు దేశ ప్రజలు. అన్ని వర్గాల వారికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ బడ్జెట్‌లోనైనా సమస్యలు పరిష్కారం అవుతాయా లేదా..?.
ఇప్పుడు అందరి చూపు బడ్జెట్ 2023పైనే ఉంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌పై కోటి ఆశలు పెంచుకున్నారు దేశ ప్రజలు. అన్ని వర్గాల వారికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ బడ్జెట్‌లోనైనా సమస్యలు పరిష్కారం అవుతాయా లేదా..? అని మదనపడిపోతున్నారు. సామాన్యుడి నుంచి వ్యాపారం చేసే వారి వరకు బడ్జెట్‌పై ఆశలు పెంచుకున్నారు. ఎందుకంటే 2024లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఎన్నికల్లోకి వెళ్లే ముందు మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. అందుకే ఈ సారి ప్రత్యేక బడ్జెట్ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశంలోని అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని నమ్ముతున్నారు. యువత సైతం ఈ బడ్జెట్‌లో గంపెడాశలతో ఎదురు చూస్తున్నారు. క్రమంలో కార్తీక్ కూడా బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్నాడు. ఉద్యోగం చేస్తున్నా.. ఎన్నో సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తన సమస్యలను లేఖ రూపంలో మంత్రి నిర్మలమ్మ ముందుంచుతున్నారు. మరి సమస్య ఏంటో ఆయన లేఖ ద్వారా తెలుసుకుందాం.
గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారూ, హాయ్, నా పేరు కార్తీక్. నేను ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నివాసిని. గత నెలలోనే నాకు హైదరాబాద్ లో ఒక స్టార్టప్‌లో ఉద్యోగం వచ్చింది. నా ట్రాన్స్ఫర్ ప్రాసెస్ కూడా ఇంకా పూర్తి కాలేదు. ఈరోజు నాకు HR నుంచి ఒక మెయిల్ వచ్చింది అది లే-ఆఫ్‌ల జాబితా సిద్ధం చేశారనీ.. అందులో నా పేరు కూడా ఉందని లేఖలో ఉంది. ఉద్యోగ నిబంధనల ప్రకారం కంపెనీ నాకు ఒక నెల జీతం ఇస్తుంది.
అలాగే ల్యాప్‌టాప్‌ను సాయంత్రంలోగా హెచ్‌ఆర్‌కు డిపాజిట్ చేయాలని ఈ-మెయిల్‌లో రాసి ఉంది. ల్యాప్‌టాప్ డిపాజిట్ చేయడానికి ముందు నేను మీకు ఈ లేఖ రాస్తున్నాను. మేడమ్ ఈ ఉద్యోగం నాకు మాత్రమే కాదు, నా కుటుంబానికి కూడా అవసరం. తండ్రి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇంట్లో తమ్ముళ్లు ఉన్నారు. ఎలాగో ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని బీటెక్ చేశాను. రోజురోజుకూ లోన్ పై వడ్డీ పెరుగుతోంది. ప్రతి 1-2 నెలలకు లోన్ ఈఎంఐ పెరుగుతోంది. ఉద్యోగం మానేసిన తర్వాత బ్యాంకు డబ్బు ఎలా తిరిగి చెల్లించాలో అర్థం కావడం లేదు. ఉద్యోగం కోల్పోయిన వార్తను కుటుంబ సభ్యులకు చెప్పే ధైర్యం నాకు లేదు. కుటుంబ భారాన్ని మోస్తున్న ఇలాంటి సమయంలో ఏం చేయలో తెలియని పరిస్థితి నెలకొంది. మేడమ్.. నాతో పాటు మరో 300 మందిని కూడా ఉద్యోగాల్లోంచి తొలగించారు. ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు వచ్చిన లేఖను చదివిన తర్వాత నా గుండె పగిలినంత పనైంది. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు.
ఈ భారీ బడ్జెట్ నుండి మనం ఏదైనా పొందగలమా? ప్రభుత్వం మాకు సహాయం చేయలేదా? అమెరికా లాగా నిరుద్యోగ భృతి మాకు అందె అవకాశం లేదా? ప్రభుత్వం మాకు వేరే కంపెనీలో ఉద్యోగం ఇప్పించగలదా? మాలాంటి వారి ఉద్యోగాలను కంపెనీలు లాక్కోకూడదని ప్రభుత్వం నిబంధన పెట్టలేదా? మాంద్యం వస్తుంటే దానిని ఆపడానికి ఇంత పెద్ద ప్రభుత్వం ఏమీ చేయలేదా? ఇప్పుడు మా మనసుల్ని కుదిపేస్తున్న ప్రశ్నలు ఇవే. అమ్మ మీరు నా తల్లిలాంటివారు. ఇప్పుడు నా బాధలు, ఆలోచనలను ఎవరికి చెప్పాలి? బాగా జీతం వచ్చే ఉద్యోగాన్ని పోగొట్టుకున్న తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలిసే ఉంటుంది. మేడమ్ నన్ను నమ్మండి.. నా కళ్ళలో నీళ్ళు కమ్ముకుంటున్నాయి.. నా చేతులు వణికిపోతున్నాయి. ఉద్యోగం పోయిన తర్వాత బాధలు అన్ని ఇన్ని కావు.. కుటుంబ బాధ్యతలు, సమస్యలు నా కళ్ల ముందే కదలాడుతున్నాయి. నా కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలి..?
మీరు రాజకీయ నాయకులు యువతను దేశ భవిష్యత్తుగా పేర్కొంటారు. మేం ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి ? మేడమ్ దయచేసి బడ్జెట్ సమయంలో మాలాంటి వారికి సహాయం చేయండి. మాలాంటి కుటుంబాలు ఎన్నో సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ బడ్జెట్‌లోనైనా మాలాంటి వారి సమస్యలు తీరుస్తారని ఎంతో ఆశగా ఈ లేఖను రాస్తున్నాను.
మీ కార్తీక్