Aadhaar Card: ఆధార్ కార్డులో కొత్త అప్డేట్.. ఇక నుంచి ఎక్కడైనా, ఎప్పుడైనా మార్చుకోవచ్చు..

ఆధార్ కార్డు వినియోగదారులకు యూఐడీఏఐ శుభవార్త అందించింది. ఇక నుంచి కొత్త ఆధార్ యాప్‌ను తీసుకురానుంది. ఈ నెల 28న యాప్‌ను లాంచ్ చేసేందుకు సిద్దమైంది. ఈ యాప్ ద్వారా మీరు ఎక్కడినుంచైనా, ఎప్పుడైనా సులువుగా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు.

Aadhaar Card: ఆధార్ కార్డులో కొత్త అప్డేట్.. ఇక నుంచి ఎక్కడైనా, ఎప్పుడైనా మార్చుకోవచ్చు..
Aadhar Card Update

Updated on: Jan 27, 2026 | 2:59 PM

ఆధార్డ్ కార్డు సేవలను మరింత సులభతరం చేసేందుకు యూఐడీఏఐ ఎప్పటికప్పుడు కొత్త కొత్త సేవలను ప్రారంభిస్తోంది. కొత్త ఆప్షన్లను ప్రవేశపెడుతూ వినియోగదారులకు ఊరట కలిగిస్తోంది. ఆధార్ కార్డులోని వివరాలను అప్‌డేట్ చేసుకునే ప్రక్రియను మరింత సులువు చేస్తోంది. గతంలో ప్రతీ దానికి ఆధార్ సెంటర్ వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అప్డేట్ ప్రాసెస్‌ను వేగవంతం చేసేందుకు ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. మొబైల్ నుంచే ఆన్‌లైన్ ద్వారా వివరాలను సవరించుకునే సదుపాయం కల్పిస్తోంది. అడ్రస్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ మెయిల్ లాంటి వివరాలను ఆన్‌లైన్ ద్వారా మార్చుకునే అవకాశం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఆధార్ కార్డుదారులకు ఉపయోగపడే మరో నిర్ణయం యూఐడీఏఐ తీసుకుంది.

ఎక్కడినుంచైనా మొబైల్ నెంబర్ అప్డేట్

ఈ నెల 28వ తేదీన యూఐడీఏఐ కొత్త ఆధార్ యాప్‌ను ప్రారంభించంది. గతంలో తీసుకొచ్చిన ఆధార్ యాప్‌లో మరిన్ని ఫీచర్లు జోడించి ఈ నెల 28న పూర్తి స్థాయి వెర్షన్‌ను లాంచ్ చేయనుంది. ఈ యాప్‌లో కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ యాప్ ద్వారా మొబైల్ నెంబర్‌ను ఎక్కడినుంచైనా, ఎప్పుడైనా మార్చుకోవచ్చని యూఐడీఏఐ వెల్లడించింది. ఆధార్ అప్డేట్‌కు సంబంధించి సేవా ఎంపికలను విస్తరిస్తున్నామని, ఇక నుంచి మరింత సులవుగా మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. జనవరి 28న ఆధార్ యాప్ పూర్తి స్థాయి వెర్షన్‌లో ఈ ఫీచర్ ఉంటుందని తెలిపింది. ఇక నుంచి ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌ను మార్చుకోవడానికి ఎన్‌రోల్‌మెంట్ల సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇప్పట్లో ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండటం అనేది చాలా అవసరం. ఏదైనా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలన్నా లేదా బ్యాంక్ కేవైసీ అప్డేట్ కోసం ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చాలామంది మొబైల్ నెంబర్లను పదే పదే మార్చుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో మొబైల్ నెంబర్‌ను అప్డేట్ చేసుకోకపోతే ఓటీపీలు అందుకోలేరు. పాత నెంబర్‌కే ఓటీపీలు వెళతాయి.

ఎలా మార్చుకోవాలంటే..?

-గూగుల్ ప్లే స్టోర్‌లోకి ఆధార్ అని సెర్చ్ చేయండి
-ఆధార్ అని కనిపించే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
-మీ మొబైల్ నెంబర్‌తో యాప్‌లోకి లాగిన్ అవ్వండి
-మొబైల్ నెంబర్ అప్డేట్ అనే ఆప్షన్ ఎంచుకోండి
-మీ కొత్త మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలు ఎంటర్ చేసి ఓటీపీని ధృవీకరించండి
-మీ ఆధార్ నెంబర్ కొద్ది రోజుల్లో అప్డేట్ అవుతుంది
-అప్డేట్ స్టేటస్‌లోకి వెళ్లి మీరు అప్డేట్ అయిందా లేదా అనేది చూసుకోవచ్చు