బ్యాంక్ ఉద్యోగులు మరోసారి సమ్మెబాట పట్టారు. ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ బ్యాంక్ సంఘాలు జాతీయస్థాయి సమ్మెకు దిగారు. ఇందులో భాగంగా రెండురోజుల పాటు దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని వెల్లడించారు. సమ్మెలో పది లక్షల మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు.
ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) దేశవ్యాప్త సమ్మెకు పిలుపు ఇవ్వడంతో సోమ, మంగళవారాల్లో బ్యాంకు సేవలకు బ్రేక్ పడింది. పది లక్షలకు పైగా బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ఈ సమ్మెలో పాల్గొంటారని యూనియన్ నాయకులు తెలిపారు.
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గత నెలలో బడ్జెట్ సమర్పణ సందర్భంగా పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమంలో భాగంగా రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రయివేటుపరం చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే అడిషనల్ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో మార్చి 4, 9, 10 తేదీల్లో జరిగిన రాజీ చర్చలు సానుకూల ఫలితం ఇవ్వకపోవడంతో సమ్మె అనివార్యంగా మారిందని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం ప్రకటించింది.
ఇదిలావుంటే… మార్చి నెలలో మొత్తం 31 రోజులు ఉండగా, అందులో నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవులు. వీటితో పాటు మహాశివరాత్రి, హోళీ పండగలు కూడా ఉండటంతో మరో రెండు రోజులు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. అలాగే ఆదివారాలు ఎప్పుడు వచ్చాయో పరిశీలిస్తే మార్చి 7, మార్చి 14, మార్చి 21, మార్చి 28 తేదీల్లో నాలుగు ఆదివారాలు వచ్చాయి. ఇక మార్చి 13న రెండో శనివారం, మార్చి 27న నాలుగో శనివారం వచ్చాయి.
ఈ రెండురోజులు కూడా బ్యాంకులకు సెలవే. వీటితో పాటు మార్చి 11న మహాశివరాత్రి, మార్చి 29వ తేదీన హోళీ పండగ సందర్భంగా బ్యాంకులకు సెలవులు రానున్నాయి. మార్చి 27 నుంచి 29వ తేదీ వరకు వరుసగా మూడు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇక ఈ ఎనిమిది రోజుల పాటు మరో రెండు రోజులు కూడా బ్యాంకులు మూత పడే అవకాశాలు ఉన్నాయి. తొమ్మిది బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్లు మార్చి 15 నుంచి సమ్మెను ప్రకటించాయి. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటైజేషన్‌ను వ్యతిరేకిస్తూ ఈ సమ్మెను చేపట్టాయి.