TRAI Data: కరోనా ప్రారంభం నుంచి అన్ని రంగాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన విషయం తెలిసిందే. ఒక్క టెలికాం రంగం మాత్రం స్థిరంగా కొనసాగుతూ వస్తోంది. అయితే.. ఇండియన్ టెలికాం మార్కెట్లో జియో ప్రభంజనం రోజురోజూకూ పెరుగుతూ వస్తోంది. ఎయిర్‌టెల్ మాత్రం భారీగా పతనమైంది. తాజాగా మే నెలలో జియోలో 35.54 లక్షల మొబైల్ వినియోగదారులు కొత్తగా చేరారు. ఇక ఎయిర్‌టెల్ సంస్థ మాత్రం మరో 46.13 మంది కస్టమర్లను కోల్పోయింది. ఈ వివరాలను టెలికాం రెగ్యులేటర్ ఆఫ్ ఇండియా (TRAI) తాజాగా గురువారం వెల్లడించింది. ఎయిర్‌టెల్ తోపాటు వొడాఫోన్ ఐడియా కూడా భారీగా కస్టమర్లను పోగొట్టుకుంది.
తాజాగా ట్రాయ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. జియో మొత్తం కస్టమర్ల సంఖ్య 43.12 కోట్లకు చేరింది. ఎయిర్‌టెల్ సంస్థ మే లో 46.13 లక్షల కస్టమర్లను పోగొట్టుకుంది. దీంతో మొత్తం కస్టమర్ల సంఖ్య 34.8 కోట్లకు పడిపోయింది. వొడాఫోన్ ఐడియా మొబైల్ కస్టమర్ల సంఖ్య 42.8 లక్షల మేర తగ్గగా.. మొత్తం కస్టమర్ల సంఖ్య 27.7 కోట్లకు పడిపోయినట్లు ట్రాయ్ వెల్లడించింది. అయితే ఇండియా మొత్తంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల్లో మొబైల్ వినియోగదారుల సంఖ్య 62.7 లక్షలు పడిపోయినట్లు ట్రాయ్ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో మొత్తం వినియోగదారుల సంఖ్య 117.6 కోట్లకు తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లోనూ జియోనే నంబర్ 1
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ జియో తన హవాను కొనసాగించింది. మొత్తం 3,21,46,712 కస్టమర్లతో జియో ముందంజలో ఉంది. మే నెలలో జియో 46,119 మంది కస్టమర్లను పెంచుకుంది. కాగా.. ఎయిర్‌టెల్ 4,08,257, వోడాఫోన్ ఐడియా 2,72,081 మంది కస్టమర్లు ఆయా సంస్థల నుంచి దూరమయ్యారు. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ అత్యధికంగా 4,15,690 మంది వినియోగదారులను కోల్పోయినట్లు ట్రాయ్ తెలిపింది.