Two wheeler sales: టూవీలర్ల అమ్మకాల టాప్ గేర్.. అక్టోబర్‌లో రికార్డుస్థాయి అమ్మకాలు
ఫెస్టివల్ సీజన్ సందర్భంగా అక్టోబర్ లో ద్విచక్ర వాహన రంగం టాప్ గేర్ లో పరుగులు తీసింది. దేశంలో టూ వీలర్ల అమ్మకాలు పెద్ద సంఖ్యలో జరిగాయి. పండగ సందర్భంగా వాహనాలను కొనుగోలు చేయడం భారతీయుల సంప్రదాయం. దానికి అనుగుణంగానే ద్విచక్ర వాహనాల విక్రయాలు జోరుగా సాగాయి. దీంతో ఆ రంగానికి దీపావళి పండగ సీజన్ బూస్ట్ ఇచ్చిందని చెప్పవచ్చు. ధన్ తేరాస్ సందర్భంగా చాాలా మంది జోరుగా కొనుగోళ్లు జరిపారు. దేశంలో అత్యధికంగా అమ్ముడైన ద్విచక్ర వాహనాల వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీదారులైన టీవీఎస్ మోటారు కంపెనీ, హీరో మోటో కార్ప్, రాయల్ ఎన్ ఫీల్డ్ దేశీయ విక్రయాల్లో 13 నుంచి 26 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అయితే బజాజ్ ఆటో మాత్రం ఈ విషయంలో క్షీణతను చవి చూసింది. పండగ సీజన్ అన్ని కంపెనీలకు ఉత్సాహాన్ని కలిగించగా, బజాజ్ ఆటో మాత్రం వెనుకబడింది. దీపావళి సందర్భంగా అక్టోబర్ లో ద్విచక్ర వాహనాల విక్రయాలు బాగా జరిగాయి. చెన్నైకి చెందిన టీవీఎస్ మోటార్స్ దేశీయ అమ్మకాల్లో (వైఓవై) 13 శాతం పెరుగుదలను సాధించింది. ఈ కంపెనీ 390,489 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో 344,957 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. గతేడాదిలో పోల్చితే ఈసారి విక్రయాల్లో మంచి వృద్ధి నెలకొంది. అలాగే టీవీఎస్ ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలోనూ ముందంజలో దూసుకుపోతోంది. దాదాపు 45 శాతం మేర అమ్మకాలను పెంచుకుంది. దేశ ప్రజలకు టీవీఎస్ వాహనాల మీదు నమ్మకానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది.
ప్రపంచంలోనే అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హీరో మోటాకార్ప్ కూడా పండగ సమయంలో అమ్మకాలను గణనీయంగా పెంచుకుంది. దేశీయ విక్రయాల్లో 17.4 శాతం వృద్ధి ని నమోదు చేసింది. గ్రాండ్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫ్ ట్రస్టు ప్రచారం ద్వారా ఈ అక్టోబర్ లో 657,403 యూనిట్లను విక్రయించింది. ముఖ్యంగా ధన్ తేరాస్ లో జోరుగా విక్రయాలు జరిగాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో కూడా హీరో మోటాకార్ప్ వాహనాలకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా 100 సీసీ, 125 సీసీ సెగ్మెంట్ వాహనాలపై కొనుగోలుదారులు ఆసక్తి చూపారు. రాయల్ ఎన్ ఫీల్ద్ కూడా పండగ సందర్భంగా విక్రయాలను పెంచుకుంది. దాదాపు 26 శాతం వృద్ధి ని సాధించింది. అక్టోబర్ నెలలో 101,886 యూనిట్ల అమ్మకాలు జరిగింది. గతేడాది ఇదే నెలలో 80,958 యూనిట్లను మాత్రమే విక్రయించింది. దీంతో ఈ దీపావళి ఆ కంపెనీకి ఉత్సాహం కలిగించింది. క్లాసిక్, కొత్త మోడళ్లకు బాగా డిమాండ్ ఏర్పడింది.
బజాజ్ ఆటో కంపెనీకి మాత్రం దీపావళి కలిసి రాలేదు. ఈ సంస్థ వాహనాల విక్రయాలు 8 శాతం తగ్గిపోయాయి. కేవలం 255,909 యూనిట్లను మాత్రమే అక్టోబర్ నెలలో విక్రయించగలిగింది. దేశంలోని ద్విచక్ర తయారీదారులు అక్టోబర్ లో ఎగుమతుల్లో గణనీయమైన ప్రగతి సాధించారు. టీవీఎస్ కంపెనీ అయితే వాహనాల ఎగుమతుల్లో 16 శాతం వృద్ధితో 87,670 యూనిట్లకు చేరింది. హీరో మోటోకార్ప్ 43 శాతం వైవై పెరుగుదలను చూసింది. దీని మోడళ్లకు ప్రపంచ మార్కెట్ లో డిమాండ్ పెరిగింది. రాయన్ ఎన్ ఫీల్డ్ కూడా 150 శాతం పెరుగుదలను సాధించింది. దక్షిణాసియా, లాటిన్ అమెరికాలో ఈ బ్రాండ్ విస్తరించింది. బజాజ్ అమ్మకాలు దేశంగా తగ్గినప్పటికీ ఎగుమతుల్లో పెరుగుదల నమోదైంది. దాదాపు 24 శాతం వృద్ధి సాధించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి