ఇటీవల కాలంలో అందరికీ ఆర్థిక అక్షరాస్యత పెరిగింది. ముఖ్యంగా కరోనా అనంతర పరిణామాల్లో అందరూ తమ భవిష్యత్తుకోసం ప్లానింగ్ కలిగి ఉంటున్నారు. ముఖ్యంగా రిటైర్ మెంట్ తర్వాత జీవితాన్ని సుఖమయం చేసుకునేందుకు ముందు నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొనే వారు కూడా పదవీవిరమణ తర్వాత జీవితం కోసం ప్రణాళికతో వెళ్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా అటువంటి వారి కోసం కొన్ని పథకాలను ప్రవేశపెట్టింది. అందులో ప్రధానమైనవి, అందరికీ తెలిసినవి నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్)కాగా రెండోది అటల్ పెన్షన్ యోజన(ఏపీవై). ఈ రెండూ పథకాలు కూడా దేనికదే ప్రత్యేకమైన ఫీచర్లు, ప్రయోజనాలను కలిగి ఉంటాయి. మరి ఈ రెండింట్లో ఏది మంచిది? ఒక వ్యక్తి ఈ రెండు పథకాలలోనూ ఒకేసారి పెట్టుబడి పెట్టొచ్చా? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) లేదా అటల్ పెన్షన్ యోజన (ఏపీవై)తో సహా రెండు పెన్షన్ పథకాలలో ఒకేసారి పెట్టుబడి పెట్టగలమా అని అడిగితే పెట్టొచ్చనే సమాధానం నిపుణుల నుంచి వస్తుంది. అయితే అందుకు కొన్ని అర్హతలున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎన్పీఎస్, ఏపీఐ పథకాలు ఏంటి? వాటిల్లో అర్హతలు, ప్రయోజనాలు గురించి ఇప్పుడు చూద్దాం..
ఎన్పీఎస్ అంటే.. ఇది స్వచ్ఛంద పదవీ విరమణ పొదుపు పథకం. దీనిని 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ప్రారంభించవచ్చు. దీనిలో టైర్ 1 లేదా టైర్ 2 రిటైర్మెంట్ సేవింగ్స్ ఖాతాలు ఉంటాయి. ఖాతాదారులు జమ చేసిన మొత్తాలు ప్రభుత్వ సెక్యూరిటీలు,ఈక్విటీల్లో పెట్టుబడిగా పెడతారు. వాటి నుంచి మీకు ఆదాయం సమకూరుతుంది.
ఏపీవై అంటే.. మరొక ప్రభుత్వ-మద్దతు గల పెన్షన్ పథకం ఇది. తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులకు ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఖాతాదారులు వారి ఆదాయం, అవసరాలకు అనుగుణంగా పథకంలో పెట్టుబడులు పెట్టొచ్చు.
నేషనల్ పెన్షన్ స్కీమ్, అటల్ పెన్షన్ స్కీమ్ మధ్య కొన్ని తేడాలు, అలాగే సారూప్యతలు ఉన్నాయి. అవేంటంటే
వయస్సు: 18 నుంచి65 సంవత్సరాల వయస్సు గల ఎవరైనా నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, అయితే 18, 40 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు మాత్రమే అటల్ పెన్షన్ యోజనకు దరఖాస్తు చేసుకోగలుతారు.
అర్హత: భారతదేశంలోని ప్రతి పౌరుడు, వారు భారతీయ నివాసి అయినా లేదా ఎన్ఆర్ఐ అయినా జాతీయ పెన్షన్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐలు అటల్ పెన్షన్ యోజనకు అర్హులైనా.. అక్టోబర్ 2022 నుండి ఆదాయపు పన్నులు చెల్లిస్తున్న వారు అర్హులు కారు.
ఖాతాలు: పెట్టుబడిదారులు ఏపీవై పథకం కింద ఒక ఖాతాను మాత్రమే కలిగి ఉంటారు. కానీ వారికి ఎన్పీఎస్లో టైర్ I, టైర్ II అనే రెండు రకాల ఖాతాలు ఉంటాయి.
నామినేషన్: మార్గదర్శకాల ప్రకారం, ఎన్పీఎస్, ఏపీవై రెండింటిలోనూ నామినీని జోడించడం తప్పనిసరి.
రిటర్న్స్: అటల్ పెన్షన్ యోజన పదవీ విరమణ తర్వాత గ్యారెంటీ రిటర్న్‌లను అందిస్తుంది. ఎన్పీఎస్ కంట్రిబ్యూషన్‌లు మార్కెట్-లింక్డ్ గా ఉంటుంది. గ్యారెంటీ రిటర్న్‌లను అందించకపోవచ్చు.
అకాల ఉపసంహరణ: ఏపీవై పథకంలో, మరణం లేదా తీవ్రమైన అనారోగ్యం సంభవించినప్పుడు అకాల ఉపసంహరణలు చేసుకోవచ్చు. ఖాతా రకాన్ని బట్టి నియమాలు మారుతూ ఉంటాయి.
పెట్టుబడి మొత్తం: ఎన్పీఎస్ సబ్‌స్క్రైబర్‌లకు కనీస పెట్టుబడి మొత్తం రూ. 500, గరిష్ట పరిమితి లేదు. ఏపీవై చందాదారులు కనీస పెన్షన్ రూ. 1,000-5,000 పొందడానికి నెలకు రూ. 42 నుంచి గరిష్టంగా రూ. 1,454 వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..