బ్యాంకుల్లో లోన్ తీసుకోవడం సర్వసాధారణమైన విషయం. వ్యక్తిగత అవసరాలకు, ఇంటి డెకరేషన్‌కు ఇలా ఒక్కో అవసరాల కోసం రుణాలు తీసుకుంటుంటారు. అయితే రుణం తీసుకునే సమయంలో బ్యాంకులు ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకుంటాయి. ఈ క్రమంలోనే బ్యాంకులు కొన్ని సందర్భాల్లో రుణాలను తిరస్కరించే అవకాశాలు కూడా ఉంటాయి. మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో ఇలాంటి సమస్యను ఎదుర్కొనే ఉంటారు. అయితే ఇలా లోన్స్ రిజక్ట్ కావడానికి కారణాలు ఏంటి.? సులభంగా రుణాలు పొందాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి ఇప్పుడు తెలుసుకుందాం..
* మీ లోన్ దరఖాస్తు ఎందుకు తిరస్కరణకు గురైందో, అందుకు గల కారణం ఏంటో ముందుగా అర్థం చేసుకోవాలి. సాధారణంగా తక్కువ క్రెడిట్ స్కోర్, తక్కువ ఆదాయం, లోన్ డిఫాల్ట్ వంటి కారణాల కారణంగా బ్యాంకులు లోన్స్‌ను రిజక్ట్ చేస్తాయి. ముందుగా లోన్ రిజక్ట్ కావడానికి గల కారణం ఏంటో తెలుసుకొని, దానిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి.
* ఏదైనా బ్యాంకు రుణం అందించాలంటే మీ క్రెడిట్ స్కోర్ కనీసం 750 కంటే ఎక్కువగా ఉండాలి. లోన్ రావడంలో క్రెడిట్ స్కోర్ కీలకమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతకు ముందు తీసుకున్న లోన్ రీ పేమెంట్స్‌లో ఏవైనా జాప్యం చేస్తే క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. కాబట్టి లోన్స్‌ను వీలైనంత వరకు సకాలంలో చెల్లించాలి.
* గతంలో తీసుకున్న లోన్స్ ఏవైనా డీఫాల్ట్ అయినా మీకు కొత్త రుణం పొందే అవకాశాలు తగ్గుతాయి. సిబిల్ స్కోర్ చెకింగ్ సమయంలో మీరు గతంలో తీసుకున్న రుణాల వివరాలన్నీ రిపోర్ట్‌లో వస్తాయి. కాబట్టి గతంలో ఏవైనా ఈఎమ్‌ఐలు చెల్లించకపోతే వెంటనే వాటిని చెల్లించాలి.
* ఇక రుణాలు రిజక్ట్ కావడానికి ప్రధాన కారణాల్లో ఆదాయం కూడా ఒకటి. సాధారణంగా మనకు వచ్చే ఆదాయంలో 30 నుంచి 40 శాతానికి మించి రుణాలు ఇవ్వవు. ఉదాహరణకు మీకు నెలకు రూ. 50,000 జీతం వస్తే బ్యాంకులు నెలకు రూ. 20,000 ఈఎమ్‌ఐ చెల్లించేలా రుణాలు ఇస్తాయి. ఆదాయం తక్కువగా ఉంటే బ్యాంకులు లోన్స్ రిజక్ట్ చేస్తాయి.
* ఇక లోన్ రిజక్ట్ కావడానికి మరో కారణంగా సరైన డాక్యుమెంట్స్ లేకపోవడం. బ్యాంకులు లోన్‌లు ఇచ్చే సమయంలో పే స్లిప్స్ మొదలు ఇతర డాక్యుమెంట్లను సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. వీటిలో ఏవైనా అందుబాటులో లేకపోతే లోన్ రిజక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..