Vande Bharat: వందే భారత్ స్లీపర్ రైలు సంచలన రికార్డ్.. వేగంలో తలదన్నేలా..

నూతన సంవత్సరం వస్తున్న వేళ రైలు ప్రయాణికులకు శుభవార్త అందింది. ప్రస్తుతం వందే భారత్ రైళ్లు ఉండగా.. వీటికి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా స్లీపర్ రైళ్లు త్వరలో ప్రవేశపెట్టనున్నారు. తాజాగా కోటా-నాగ్ధా ప్రాంతాల మధ్య ట్రయల్ రన్ నిర్వహించగా.. ఇది అరుదైన రికార్డ్ నమోదు చేసింది

Vande Bharat: వందే భారత్ స్లీపర్ రైలు సంచలన రికార్డ్.. వేగంలో తలదన్నేలా..
Vande Bharat Sleeper

Updated on: Dec 31, 2025 | 6:30 AM

కొత్త ఏడాదిలో భారతీయ రైల్వేల ముఖచిత్రం పూర్తిగా మారనుంది. అత్యాధునిక సాంకేతికతతో కూడుకున్న వందే భారత్ స్లీపర్ రైళ్లు 2026లో రయ్.. రయ్ అంటూ పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి. ఇప్పటికే ట్రయల్ రన్స్ పూర్తవ్వగా.. జనవరిలోనే ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సర్వీసులు అందిస్తున్న వందే భారత్ రైళ్లల్లో సాధారణ, చైర్ కార్ కోచ్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దూరపు ప్రయాణాలు చేసేవారు ఎక్కువసేపు కూర్చోవాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక రాత్రి ప్రయాణాల్లో మరింతగా ఇబ్బందికి గురవుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వందే భారత్ స్లీపర్ రైళ్లను రాత్రి వేళ ప్రయాణం చేసేవారి కోసం తీసుకొస్తున్నారు.

వందే భారత్ స్లీపర్ రికార్డ్

తాజాగా వందే భారత్ స్లీపర్ రైలు మరో సత్తా చాటింది. రాజస్థాన్‌లోని కోటా-నాగ్ధా ప్రాంతాల మధ్య ట్రయల్ రన్ నిర్వహించారు. ఇందులో వందే భారత్ స్లీపర్ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి రికార్డ్ నమోదు చేసింది. అంతేకాకుండా ట్రైన్ స్థిరత్వాన్ని పరీక్షించేందుకు రైల్వేశాఖ రైల్లో వాటర్ టెస్ట్ నిర్వహించింది. ఇందుకోసం ట్రైన్‌లో వాటర్ గ్లాసులు ఉంచారు. 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లినా గ్లాసుల నుంచి ఒక్క చుక్క నీరు కూడా కింద పడలేదు. ఈ విషయాన్ని తెలుపుతూ రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ట్రయల్ రన్స్‌లో ఈ కొత్త రకం స్లీపర్ రైలు సాంకేతిక లక్షాణాలను ప్రదర్శించిందని పేర్కొన్నారు.

త్వరలో తొలి రైలు ప్రారంభం

వందే భారత్ స్లీపర్ రైళ్లను రాత్రి వేళ ప్రయాణికుల కోసం తీసుకొస్తున్నారు. దీంతో రాత్రి వేళ ఎలాంటి కుదుపులు లేకుండా సౌకర్యవంతంగా వీటిల్లో ప్రయాణించవచ్చు. ఈ వాటర్ టెస్ట్ అందుకు బలం చేకూరుస్తోంది. ఈ స్లీపర్ రైళ్లల్లోనే అనేక కొత్త ఫీచర్లు ప్రవేశపెట్టారు. సెన్సార్ లైటింగ్, బయో వాక్యూమ్ వాష్ రూమ్స్, కవచ్ టెక్నాలజీ లాంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇక థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ కోచ్‌లు అందుబాటులో ఉండనున్నాయి. బీఈఎంఎల్, ఐపీఎఫ్ సంస్థలు కలిపి ఈ వందే భారత్ స్లీపర్ రైలును అభివృద్ది చేయగా.. ఇందులో 16 కోచ్‌లు ఉంటాయి. తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ త్వరలో ఢిల్లీ-పాట్నా మధ్య ప్రారంభించనున్నారు. అనంతరం రెండో రోజులు ఢిల్లీ-ముంబై ప్రాంతాల మధ్య రానుండగా.. ఆ తర్వాత దశలవారీగా దేశవ్యాప్తంగా వివిధ రూట్లలో ప్రవేశపెట్టనున్నారు.