
అమెరికాలోని అలెఫ్ ఏరోనాటిక్స్ అనే స్టార్టప్ కంపెనీ ప్రపంచంలోనే మెట్టమెదటిసారిగా ఎగిరే కారును తయారు చేసింది. దీన్ని కాలిఫోర్నియాలో ప్రయోగాత్మకంగా ఆవిష్కరించింది. ఆ కారు నెలపై నడుస్తూ, దారిలో పార్కింగ్ చేసిన ఓ కారుపై ఎగురుతూ వెళ్లింది. దాన్ని దాటాక సురక్షితంగా నేలపై దిగింది. ఈ వీడియోను ఆ కంపెనీల సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రమాదాలు జరిగినప్పుడు, రోడ్డుపై చెట్టు, రాళ్లు పడిపోయినప్పుడు, అత్యవసరం సమయంలో ఈ ఎగిరే కారు చాలా ఉపయోగంగా ఉంటుంది. అలెఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ సీఈవో జిమ్ దుఖోన్నీ మాట్లాడుతూ పెరుగుతున్న సాంకేతికతకు ఎగిరే కారు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. రైట్ బ్రదర్స్ కు తొలిసారిగా విమానాన్ని నడిపినప్పడు కలిగిన భావనే ఇప్పుడు తమకు కలిగిందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలకు సరికొత్త రవాణా సాధనం అందిస్తున్నామన్నారు.
ఎగిరే కారు డిజైన్ క్వాడ్ కాప్టర్ డ్రోన్ మాదిరిగా కనిపిస్తుంది. బయట రోటర్ బ్లేడ్లు ఏర్పాటు చేశారు. రోడ్డు మీద నడిచే కారుకు భిన్నంగా రూపొందించారు. వాహనం చాసిస్ లోపల దాని రోటర్ బ్లేడ్లు దాగి ఉంటాయి. ఈ వాహనం పూర్తిగా విద్యుత్ తో నడుస్తుంది. రోడ్డుపై ప్రయాణించినప్పడు సుమారు 320 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అలాగే దాదాపు 160 కిలోమీటర్ల విమానం రేంజ్ వస్తుంది. సంపన్నులతో పాటు సామాన్యులకు కూడా ఈ కారును అందుబాటులోకి తీసుకురావడానికి కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. ఎగిరే కారుకు సంబంధించిన మోడల్ ఏ ఉత్పత్తిని ఈ ఏడాది చివరిలో అలెఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ ప్రారంభించనుంది. దాని కోసం ఇప్పటికే 3,300 కంటే ఎక్కువ ఆర్డర్లు అందుకుంది.
అందరికీ సకాలంలో కార్లను అందించడం కోసం పుకారా ఏరో, ఎంవైసీ కంపెనీతో ఒప్పందం కూడా చేసుకుంది. ఎయిర్ బస్, బోయింగ్ కోసం ఏవిగేషన్ గ్రేడ్ భాగాలను ఉత్పత్తి చేయడంలో పుకారా కంపెనీ ప్రసిద్ది చెందింది. అన్ని రకాల రోడ్లపై ఎగిరే కారు చక్కగా పరుగులు తీస్తుంది. అవసరమైనప్పుడు నిలువుగా పైకి ఎగురుతుంది. రోడ్డుపై అడ్డుగా ఉన్న వాహనాలపై నుంచి ఎగురుతూ పోతుంది. వాటిని దాటాక చాలా సురక్షితంగా నేలపై దిగుతుంది. త్వరలో ఉత్పత్తి జరగనున్న మోడల్ ఏ ఎగిరే కారు ధర 3 లక్షల డాలర్లు ఉండవచ్చని చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి