
2026 మార్చి 31 నాటికి ఈ ఉత్పత్తులపై పరిహార సెస్(కంపెన్సేషన్ సెస్-రాష్ట్రాలకు చెల్లించె పన్ను విధానం)ను దశలవారీగా ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతిపాదిత విధానం ద్వారా ప్రజారోగ్య సమస్యలను పరిష్కరిస్తూ పన్ను ఆదాయాన్ని కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. గతంలో 25% GST తగ్గించినప్పటికీ.. ప్రస్తుతం 40 శాతానికి పెంచే ఉద్దేశ్యం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వాలు ఆదాయ కొరతను ఎదుర్కొన్నప్పుడు లేదా ఎక్కువ ఆదాయం అవసరమైనప్పుడు, వారు మొదట చూసేది ధూమపానం చేసేవారిని, మద్యపానం చేసేవారిని.
ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను మినహాయింపులను అందించింది. దీనివల్ల ప్రభుత్వానికి పన్ను వసూళ్లు స్వల్పంగా తగ్గుతాయని భావిస్తున్నారు. అదేవిధంగా, పొగాకు ఉత్పత్తులపై పరిహార సెస్ వచ్చే ఏడాదితో ముగుస్తుంది. దీనివల్ల ప్రభుత్వానికి పన్ను ఆదాయం కూడా తగ్గవచ్చు. దీనిని భర్తీ చేయడానికి, ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై GSTని పెంచబోతోంది. ఇలా జీఎస్టీ పెంచినట్లయితే సిగరేట్ల ధర భారీగా పెరిగే అవకాశం ఉంది.
మానవ ఆరోగ్యానికి హానికరమైన పొగాకు, మద్యం ఉత్పత్తులను ప్రమాదకరమైన వస్తువులుగా పరిగణిస్తారు. ఈ వస్తువులపై ఎక్కువ పన్ను విధిస్తారు. దీని వలన ప్రజలు వాటిని కొనకుండా నిరుత్సాహపడతారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు ప్రకారం, సిగరెట్లపై 75 శాతం పన్ను విధించాలి.
భారతదేశంలో 28% GSTతో సహా, సిగరెట్లపై మొత్తం పన్ను 53 శాతంగా ఉన్నాయి. ఇందులో 5% పరిహార సెస్ కూడా ఉంటుంది. ఎక్సైజ్ సుంకం, జాతీయ విపత్తు నిధి సుంకంతో సహా మొత్తం పన్ను రేటు 10%. ఇది 52.7 శాతం అవుతుంది. ఈ పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీని గరిష్టంగా 40 శాతానికి పెంచడంతో పాటు అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించాలని కూడా జీఎస్టీ కౌన్సిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక సర్వే ప్రకారం.. దేశంలో సిగరెట్ తాగే వారి సంఖ్య 27 కోట్లకు పైగా ఉంది. పొగాకు ఉత్పత్తులపై పన్నుల ద్వారా ప్రభుత్వానికి రూ.80,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి