AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పన్ను ఆదా చేయాలనుకుంటున్నారా? మీ కష్టార్జితం కాపాడే సెక్షన్ 80సీ ఆప్షన్స్‌ ఇవే!

ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే పన్ను ఆదా చింత మొదలవుతుంది. చివరి నిమిషం తొందరపాటు కాకుండా, ముందుగానే సెక్షన్ 80C కింద సరైన ప్రణాళికతో పెట్టుబడులు పెట్టడం ద్వారా పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. ELSS, PPF, NSC, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలను పరిగణనలోకి తీసుకుని రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.

పన్ను ఆదా చేయాలనుకుంటున్నారా? మీ కష్టార్జితం కాపాడే సెక్షన్ 80సీ ఆప్షన్స్‌ ఇవే!
Tax Saving
SN Pasha
|

Updated on: May 10, 2026 | 6:21 AM

Share

ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలు, పన్ను చెల్లింపుదారుల్లో ఒక సాధారణ ఆందోళన మొదలవుతుంది.. “ఈసారి పన్ను ఎలా ఆదా చేసుకోవాలి?” చాలామంది చివరి నిమిషంలో తొందరపాటుగా పెట్టుబడులు పెడుతుంటారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ముందుగానే సరైన ప్రణాళికతో పెట్టుబడులు ప్రారంభిస్తే పన్ను భారం తగ్గించుకోవడంతో పాటు భవిష్యత్తుకు బలమైన ఆర్థిక భద్రతను కూడా నిర్మించుకోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం కొత్త పన్ను విధానం, పాత పన్ను విధానం అనే రెండు ఎంపికలను అందిస్తోంది. కొత్త విధానంలో తక్కువ పన్ను రేట్లు ఉన్నప్పటికీ, చాలా పన్ను మినహాయింపులు అందుబాటులో ఉండవు. అందుకే పాత పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కీలకంగా మారింది. ఈ సెక్షన్ కింద సంవత్సరానికి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.

మితమైన రిస్క్ తీసుకుని మంచి రాబడులు ఆశించే వారికి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) మంచి ఎంపికగా భావిస్తున్నారు. ఇది స్టాక్ మార్కెట్‌కు అనుసంధానమైన మ్యూచువల్ ఫండ్ పథకం. దీని లాక్-ఇన్ పీరియడ్ కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే ఉండటం ప్రధాన ఆకర్షణ. మార్కెట్ బాగా రాణిస్తే దీర్ఘకాలంలో మంచి సంపద సృష్టించే అవకాశం ఉంటుంది. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌) ఇప్పటికీ అత్యంత విశ్వసనీయమైన ప్రభుత్వ పథకంగా కొనసాగుతోంది. ప్రస్తుతం దీనిపై సుమారు 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. పెట్టుబడి, వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం మూడు కూడా పన్ను రహితంగా ఉండటం దీని ప్రత్యేకత.

అదేవిధంగా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్‌ఎస్‌సీ) కూడా భద్రత కోరుకునే పెట్టుబడిదారులకు మంచి ఎంపిక. పోస్టాఫీస్ ద్వారా అందించే ఈ పథకానికి ఐదేళ్ల లాక్-ఇన్ ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన స్థిరమైన వడ్డీ రేటుతో హామీ రాబడి లభిస్తుంది. కుమార్తెలు ఉన్న కుటుంబాలకు సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై) మరో కీలక పథకం. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను మినహాయింపుతో పాటు కుమార్తెల భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కల్పించవచ్చు. అయితే సెక్షన్ 80సీ కింద మొత్తం పన్ను మినహాయింపు పరిమితి రూ.1.5 లక్షల వరకే ఉంటుందని పన్ను నిపుణులు గుర్తు చేస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us