Tata Motors: ఆ వాహనాల ధరలు పెంచనున్న టాటా మోటార్స్.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు..

|

Mar 22, 2022 | 4:09 PM

మార్చిలో పెరిగిన ద్రవ్యోల్బణం(Inflation) అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. పాలు, మ్యాగీ ధరలు పెరిగిన తర్వాత మంగళవారం పెట్రోలు, డీజిల్‌, ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ల ధర పెరిగింది...

Tata Motors: ఆ వాహనాల ధరలు పెంచనున్న టాటా మోటార్స్.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు..
Tata Motors
Follow us on

మార్చిలో పెరిగిన ద్రవ్యోల్బణం(Inflation) అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. పాలు, మ్యాగీ ధరలు పెరిగిన తర్వాత మంగళవారం పెట్రోలు, డీజిల్‌, ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ల ధర పెరిగింది. పెరిగిన ద్రవ్యోల్బణం, రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ఆటోమొబైల్(automobile) రంగంపై కూడా ప్రభావం పడుతోంది. దీంతో ఆ కంపెనీలు ధరలు పెంచాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్(Tata Motors) మంగళవారం తన వాణిజ్య వాహనాల శ్రేణి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1, 2022 నుంచి పెంచిన ధరలు అమలులోకి వస్తాయని తెలిపింది. వాణిజ్య వాహనాల ధరలను కంపెనీ 2 నుంచి 2.5 శాతం పెంచనుంది. ఈ పెంపు మోడల్, వేరియంట్ ఆధారంగా నిర్ణయిస్తారు. స్టీల్, అల్యూమినియం, ఇతర విలువైన లోహాల ధరలు పెరగడంతోపాటు ఇతర ముడిసరుకు ధరలు పెరగడం వాణిజ్య వాహనాల ధరలు పెంచడానికి కారణమైందని కంపెనీ పేర్కొంది. టాటా మోటార్స్ గతేడాదిలో కూడా వాణిజ్య వాహనాల ధరలు పెంచింది.

లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ ఇండియా.. వచ్చే నెల ఏప్రిల్ 1, 2022 నుంచి కార్ల ధరల పెంచనుంది. అన్ని మోడళ్ల వాహనాలపై 3 శాతం వరకు ధరలు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. కార్ల ధర రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకు పెరగనుంది. లాజిస్టిక్స్‌తో పాటు ఉత్పత్తి వ్యయం నిరంతరం పెరుగుతోందని, అందుకే ఈ చర్య తీసుకోవలసి వచ్చిందని కంపెనీ పేర్కొంది. 137 రోజుల తర్వాత మంగళవారం చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచాయి. లీటర్ పెట్రోల్‌పై 91 పైసలు, లీటర్ డీజిల్‌పై 80 పైసలు పెంచాయి. గతేడాది నవంబర్‌ తర్వాత పెరగడం ఇదే తొలిసారి. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.21కి పెరిగింది. కాగా ఒక లీటర్ డీజిల్‌కు రూ.87.47 చెల్లించాల్సి ఉంటుంది.

ఇటు ఎల్‌పీజీ సిలిండర్‌ ధర కూడా పెరిగింది. ఒక్కో సిలిండర్‌పై రూ.50 చొప్పున పెంచారు. ధర పెరిగిన తర్వాత, న్యూఢిల్లీలో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ కొత్త ధర రూ.949.5 గా మారింది. అంతకుముందు రూ.899.50గా ఉంది. కోల్‌కతాలో ఎల్‌పిజి సిలిండర్ ధర 976 రూపాయలకు చేరుకుంది. గతంలో ఇక్కడ దీని ధర రూ.926. ముంబైలో 949.50. చెన్నైలో నాన్ సబ్సిడీ సిలిండర్ ధర ఇప్పుడు రూ.965.50. తెలంగాణలో సిలిండర్ ధర రూ. 1002కి చేరుకోగా.. ఆంధ్రప్రదేశ్‌లో అయితే సిలిండర్ ధర రూ. 1008కు పెరిగింది. అయితే చమురు కంపెనీలు మంగళవారం 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను రూ.8.5 తగ్గించాయి. ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ ధర రూ.8.5 తగ్గి రూ.2,003.50కి చేరుకుంది. ఇంతకుముందు దీని ధర రూ.2,012.

Read Also.. Stock Market: రాణించిన ఐటీ, ఆటోమొబైల్ షేర్లు.. లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..