Stock Market: కరోనా భయాలు…భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Stock Market Updates: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కోవిడ్ కేసుల సంఖ్య అడ్డూ అదుపు లేకుండా రోజురోజుకూ పెరుగుతోంది.

Stock Market: కరోనా భయాలు...భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
Stock Market
Follow us

|

Updated on: Apr 19, 2021 | 10:22 AM

Stock Market Updates: దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కోవిడ్ కేసుల సంఖ్య అడ్డూ అదుపు లేకుండా రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువకావడంతో స్టాక్ మార్కెట్‌‌కు నష్టాల భయం పట్టుకుంది. దీంతో సోమవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా నష్టపోయింది. కొద్దిసేపటి క్రితం బీఎస్ఈ సెన్సెక్స్ 1353 పాయింట్ల నష్టంతో 47,479 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతుండగా…నిఫ్టీ 392 పాయింట్ల నష్టంతో 14,226 పాయింట్ల దగ్గర ట్రేడింగ్ కొనసాగిస్తోంది.

ఆటోమొబైల్, ఐటీ, టెక్, బ్యాంకింగ్ రంగ షేర్లు నష్టాలబాటపట్టాయి.  విప్రో, టాటా మోటార్స్, కొటాక్ మహీంద్ర, బజాజ్ ఫినాన్స్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండసిండ్ బ్యాంక్ తదితర షేర్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, దివిస్ ల్యాబ్స్ తదితర ఫార్మా రంగ షేర్లు మాత్రం లాభాల్లో కొనసాగుతున్నాయి.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా పలు రాష్ట్రాల్లో వీకెండ్ లాక్‌డౌన్, రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఇది పరిశ్రమలపై తీవ్ర ప్రభావాన్ని చూపించొచ్చన్న ఆందోళన నెలకొంటోంది. దీంతో మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. స్టాక్ మార్కెట్‌లో తమ పెట్టుబడులను వదిలించుకునేందుకే మొగ్గుచూపుతున్నారు. ఆర్థికంగా సంక్లిష్టమైన ప్రస్తుత పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడులే ఉత్తమ మార్గమని భావిస్తున్నారు. విక్రయాల ఒత్తిడి నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

దేశంలో కరోనా ఉధృతి ఇలా… ఇదిలా ఉండగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన ప్రకటన మేరకు దేశంలో గత 24 గం.ల వ్యవధిలో కొత్తగా 2,73,810 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 1,619 మంది కరోనా బారినపడి దుర్మరణం చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 1, 50,61,919కి చేరుకుంది. సోమవారంనాటికి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 19,29,329గా ఉంది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 1,78,769 మంది కరోనా బారినపడి మృతి చెందారు.