Credit Card: అప్పుల ఊబిలో చిక్కుకోకుండా ఉండాలంటే.. క్రెడిట్ కార్డ్‌ను ఇలా వాడండి!
క్రెడిట్ కార్డులు సౌలభ్యం, క్యాష్‌బ్యాక్‌లు అందిస్తాయి, కానీ సరైన నియంత్రణ లేకపోతే ఆర్థిక సమస్యలకు దారితీయవచ్చు. మీ అవసరాలకు తగ్గ కార్డును ఎంచుకోవడం, ప్రతి నెలా పూర్తి బిల్లు చెల్లించడం, పరిమితికి మించి ఖర్చు చేయకపోవడం, నగదు ఉపసంహరణలు నివారించడం వంటివి ఆర్థిక నష్టాల నుండి మిమ్మల్ని కాపాడి, క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరుస్తాయి.

ఈ రోజుల్లో క్రెడిట్ కార్డులు వినియోగదారుల జీవితంలో కీలక భాగంగా మారాయి. ట్యాప్ చేస్తే చాలు చెల్లింపులు పూర్తవడం, క్యాష్‌బ్యాక్‌లు, రివార్డ్ పాయింట్లు, ఆఫర్లు లభించడం వల్ల చాలా మంది విస్తృతంగా వాటిని ఉపయోగిస్తున్నారు. అయితే సరైన నియంత్రణ లేకుండా వాడితే, క్రెడిట్ కార్డులు ఆర్థిక సమస్యలకు దారితీయవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిపుణుల ప్రకారం ముందుగా తమ అవసరాలకు సరిపోయే కార్డును ఎంపిక చేసుకోవడం అత్యంత ముఖ్యమైన విషయం. రోజువారీ ఖర్చులు, ఇంధనం, కిరాణా లేదా ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువగా చేసే వారికి సాధారణ క్యాష్‌బ్యాక్ కార్డులు ఉపయోగకరంగా ఉంటాయి. తరచుగా ప్రయాణాలు చేసే వారు లాంజ్ యాక్సెస్, ఎయిర్ ట్రావెల్ ప్రయోజనాలు ఉన్న ప్రీమియం కార్డులను పరిశీలించవచ్చు.
అయితే చాలామంది కేవలం ఆకర్షణీయమైన ఫీచర్ల కోసం కార్డులు ఎంచుకుని తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిపుణులు చెబుతున్నారు. రివార్డ్ పాయింట్లు, బోనస్ ఆఫర్లు చూసి మాత్రమే కార్డు తీసుకోవడం సరైంది కాదని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా క్రెడిట్ కార్డులపై వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రతి నెల బిల్లును పూర్తిగా చెల్లించకపోతే, మిగిలిన మొత్తంపై భారీ వడ్డీ పడుతుంది. దీంతో సంపాదించిన రివార్డుల కంటే ఎక్కువ నష్టం కలగవచ్చు. ఆర్థిక నిపుణులు “ఫుల్ పేమెంట్ రూల్”ను అత్యంత ముఖ్యమైన అలవాటుగా పేర్కొంటున్నారు. కనీస బకాయి మాత్రమే చెల్లించడం వల్ల ఖాతా యాక్టివ్‌గా ఉన్నప్పటికీ, మిగిలిన మొత్తంపై వడ్డీ పెరుగుతూ ఉంటుంది. అందువల్ల ప్రతి నెల పూర్తి బిల్లును చెల్లించడం మంచిదని సూచిస్తున్నారు.
అలాగే అధిక క్రెడిట్ పరిమితి ఉందని మొత్తం వినియోగించడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగతంగా ఒక ఖర్చు పరిమితిని నిర్ణయించుకుని, దానికంటే ఎక్కువ ఖర్చు చేయకుండా ఉండటం మంచిదని చెబుతున్నారు. ఇది క్రెడిట్ స్కోర్ మెరుగుపడటానికి కూడా సహాయపడుతుంది. ఆలస్య చెల్లింపులు జరిమానాలు మాత్రమే కాకుండా క్రెడిట్ స్కోర్‌ను కూడా దెబ్బతీస్తాయి. అందుకే రిమైండర్లు లేదా ఆటో-పే సదుపాయాలను ఉపయోగించడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసరం కాకపోతే క్రెడిట్ కార్డు ద్వారా నగదు ఉపసంహరణ చేయకూడదని కూడా హెచ్చరిస్తున్నారు. సరైన నియంత్రణతో ఉపయోగిస్తే క్రెడిట్ కార్డులు సౌకర్యం, ఆర్థిక ప్రయోజనాలు అందిస్తాయని, కానీ నిర్లక్ష్యంగా వాడితే అప్పుల చక్రంలో చిక్కుకునే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
