
పెట్టుబడి మార్కెట్‌లో వెండి ఎప్పుడూ ఒక వింతైన ఆస్తి. ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండే వెండి, వ్యవస్థపై నమ్మకం సడలినప్పుడు మాత్రం రాకెట్‌లా దూసుకుపోతుంది. ప్రస్తుతం వెండి ధరలు మళ్లీ రికార్డు స్థాయికి చేరుతుండటంతో ఇన్వెస్టర్లలో ఒకవైపు ఆనందం.. మరోవైపు మెగా క్రాష్ భయం పొంచి ఉంది. వెండి చరిత్రను గమనిస్తే, ప్రతి భారీ పెరుగుదల తర్వాత ఒక పతనం కనిపిస్తోంది. వియత్నాం యుద్ధం, చమురు సంక్షోభం సమయంలో 1975లో కేవలం 3.8 డాలర్లు ఉన్న వెండి, 1979 నాటికి 48డాలర్లకి చేరింది. కానీ అమెరికా వడ్డీ రేట్లు పెంచగానే 89శాతం కుప్పకూలింది. 2008లో బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలిన సమయంలో 4 నుండి ప్రారంభమైన వెండి ప్రయాణం 2011 నాటికి 50డాలర్లకి చేరింది. ఆ తర్వాత మళ్లీ 72శాతం మేర పతనమైంది.
2020 మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా పెరిగిన అప్పులు, ద్రవ్యోల్బణం భయాల మధ్య వెండి ధరలు అసాధారణంగా పెరిగాయి. కనిష్ట స్థాయిల నుండి ఇప్పటికే సుమారు 800శాతం వృద్ధిని నమోదు చేసిన వెండి, ప్రస్తుతం ఔన్సుకు 108డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
మార్కెట్ నిపుణుల ప్రకారం.. వెండి ధరలో ఒక డేంజర్ జోన్ కనిపిస్తోంద. :గత రికార్డుల ప్రకారం వెండి ధర 11 రెట్లు పెరిగిన ప్రతిసారీ భారీ పతనం సంభవించింది. వెండి ధర 125 – 130 డాలర్ల పరిధికి చేరుకుంటే మార్కెట్‌లో భయాందోళనలు మొదలయ్యే అవకాశం ఉంది. వెండి 11 రెట్లు పెరగడం అంత సులభం కాకపోయినప్పటికీ, ఆ స్థాయికి చేరిన వెంటనే మెగా క్రాష్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డబ్బు విలువ తగ్గుతున్నప్పుడు, వ్యవస్థపై నమ్మకం పోతున్నప్పుడు వెండి వైపు ప్రజలు పరుగులు తీస్తారు. కానీ ఈ పరుగులు మితిమీరితే అది బుడగలా పగిలిపోయే ప్రమాదం ఉంది. వెండిలో పెట్టుబడి పెట్టేవారు ప్రస్తుత లాభాలను చూసి మురిసిపోకుండా గతాన్ని దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ధర 125 డాలర్ల మార్కును చేరుకుంటున్న తరుణంలో లాభాలను స్వీకరించడం ఉత్తమమని విశ్లేషకులు సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి