Stock Market: భారీ లాభాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్లు.. భారీగా పెరిగిన హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ షేర్ల ధర..
అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఎఫ్‌ఐఐల కొనుగోలు తిరిగి ప్రారంభం కావడం మార్కెట్లకు కలిసొచ్చే అవకాశం ఉంది.
అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో స్టాక్ మార్కెట్లు(Stock Market) లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఎఫ్‌ఐఐ(FII)ల కొనుగోలు తిరిగి ప్రారంభం కావడం మార్కెట్లకు కలిసొచ్చే అవకాశం ఉంది. అలాగే గత నెల జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదు కావడం కూడా మదుపర్లలో ఉత్సాహం నింపే అంశం. వీటితో పాటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు, చమురు ధరల కదలికలు కీలకం మారాయి. ఈనెల 6-8 తేదీల్లో జరిగే ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలపై కూడా మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ పరిణామాల మధ్య ఉదయం 9:55 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 1,197 పాయింట్ల లాభంతో 60,474 వద్ద, నిఫ్టీ (Nifty) 322 పాయింట్లు లాభపడి 17,993 వద్ద ట్రేడవుతున్నాయి.
డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.78 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎంఅండ్ఎం, ఇన్ఫోసిస్, మారుతీ, పవర్‌గ్రిడ్, ఐటీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు మాత్రమే నష్టాల్లో కొనసాగుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టైటన్, టెక్ మహీంద్రా, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. తనఖా రుణదాత హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్‌డిఎఫ్‌సి) ఏప్రిల్ 4న తన పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థలైన హెచ్‌డిఎఫ్‌సి ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్, హెచ్‌డిఎఫ్‌సి హోల్డింగ్స్ లిమిటెడ్‌లను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లిమిటెడ్‌తో విలీనానికి ఆమోదించినట్లు తెలిపింది. దీంతో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు 7.50 శాతం పెరిగి రూ.1619.20 వద్ద మార్కెట్ విలువ రూ.8,97,933.99 కోట్లుగా ఉన్నాయి. మరోవైపు హెచ్‌డిఎఫ్‌సి 9.27 శాతం జంప్ చేసి రూ. 2678.20కి చేరింది మరియు రూ. 4,85,564.27 కోట్లకు చేరుకుంది.