హిండెన్‌బర్గ్ ఆరోపణలు.. అదానీ గ్రూప్‌కు సెబీ క్లీన్‌చిట్‌! గౌతమ్‌ అదానీ రియాక్షన్‌ ఇదే..

సెబీ, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలకు సంబంధించి అదానీ గ్రూప్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. రుణాలను సక్రమంగా తిరిగి చెల్లించారని, నిధులను పక్కదారి పట్టించలేదని సెబీ తేల్చింది. అదానీ గ్రూప్ ఛైర్మన్‌ గౌతమ్ అదానీ ఈ తీర్పును స్వాగతించారు. హిండెన్‌బర్గ్ ఆరోపణలు నిరాధారమని, తమ సంస్థ పారదర్శకంగా వ్యవహరిస్తుందని ఆయన పేర్కొన్నారు.

హిండెన్‌బర్గ్ ఆరోపణలు.. అదానీ గ్రూప్‌కు సెబీ క్లీన్‌చిట్‌! గౌతమ్‌ అదానీ రియాక్షన్‌ ఇదే..
Sebi And Adani

Updated on: Sep 18, 2025 | 10:00 PM

అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలకు సంబంధించి అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీకి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) గురువారం క్లీన్ చిట్ ఇచ్చింది. ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని అని పేర్కొంది. సెప్టెంబర్ 18 నాటి రెండు వేర్వేరు ఉత్తర్వులలో హిండెన్‌బర్గ్ ఆరోపణలకు సంబంధించి అదానీ గ్రూప్‌పై ఎటువంటి జరిమానా విధించడం లేదని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ పేర్కొంది.

అదానీ గ్రూప్‌.. రుణాలను వడ్డీతో తిరిగి చెల్లించారని, నిధులను పక్కదారి పట్టించలేదని, అందువల్ల మోసం లేదా అన్యాయమైన వాణిజ్య పద్ధతి లేదని సెబీ వెల్లడించింది. అదానీ పోర్ట్స్ అడికార్ప్ ఎంటర్‌ప్రైజెస్‌కు నిధులను బదిలీ చేసిందని, ఆ నిధులను అదానీ పవర్‌కు రుణాలుగా అందించిందని సెబీ తన దర్యాప్తులో కనుగొందని, అయితే అదానీ పవర్ అడికార్ప్ ఎంటర్‌ప్రైజెస్‌కు రుణాలను తిరిగి చెల్లించింది, తరువాత అది వడ్డీతో అదానీ పోర్ట్స్‌కు తిరిగి చెల్లించింది.

అదేవిధంగా దర్యాప్తు చేస్తున్న మరో కేసులో అదానీ పోర్ట్స్ మైల్‌స్టోన్ ట్రేడ్‌లింక్స్‌కు నిధులను రుణంగా బదిలీ చేసి, తరువాత వాటిని అదానీ పవర్‌కు బదిలీ చేసింది. కానీ అదానీ పవర్ మైల్‌స్టోన్ ట్రేడ్‌లింక్స్‌కు రుణాన్ని తిరిగి చెల్లించింది, ఆ తర్వాత అది వడ్డీలతో అదానీ పోర్ట్స్‌కు తిరిగి చెల్లించిందని సెబీ పేర్కొంది. అందువల్ల దర్యాప్తు కాలంలో వివిధ దశలలో రుణాలు చెల్లించారని, ఆ తర్వాత వడ్డీతో తిరిగి చెల్లించినట్లు సెబీ నిర్ధారించింది.

సెబీ తీర్పును స్వాగతించిన గౌతమ్ అదానీ

అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీ సెబీ తీర్పును స్వాగతించారు. తమ గ్రూప్ భారతదేశ సంస్థలు, భారత ప్రజలకు కట్టుబడి ఉందని చెప్పారు. హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను నిరాధారమైనవి అని కొట్టిపారేశారు. తమ గ్రూప్ ఎల్లప్పుడూ పారదర్శకత, సమగ్రతను కాపాడుతుందని ఆయన అన్నారు. ఈ మోసపూరిత, ప్రేరేపిత నివేదిక కారణంగా డబ్బు కోల్పోయిన పెట్టుబడిదారుల బాధను తాము అర్థం చేసుకోగలమని అన్నారు. తమపై తప్పుడు కథనాలను వ్యాప్తి చేసిన వారు దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

హిండెన్‌బర్గ్ ఆరోపణలు..

2021లో అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ సంస్థ అదానీ గ్రూప్ అడికార్ప్ ఎంటర్‌ప్రైజెస్, మైల్‌స్టోన్ ట్రేడ్‌లింక్స్, రెహ్వర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే మూడు కంపెనీలను అదానీ గ్రూప్ సంస్థల మధ్య డబ్బును మళ్లించడానికి మార్గాలుగా ఉపయోగించుకుందని ఆరోపించింది. ఇది అదానీ సంబంధిత పార్టీ లావాదేవీలపై నియమాలను తప్పించుకోవడానికి సహాయపడిందని, బహుశా పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించే అవకాశం ఉందని వాదన.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి