
మీరు చిన్నపాటి వ్యాపారం ప్రారంభించే ఆలోచనలో ఉన్నారా? అయితే పెట్టుబడి కోసం చింతించనవసరం లేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మీకో అద్భుత అవకాశం కల్పిస్తోంది. అత్యల్ప వడ్డీతో, ఎటువంటి పూచీకత్తు అవసరం లేకుండా లక్ష రూపాయల వరకు రుణం పొందే వీలు కల్పిస్తోంది. ఎస్‌బీఐలో మీ ఖాతా ఆరు నెలలు పూర్తయితే చాలు, ఈ రుణం మంజూరు చాలా సులభం అవుతుంది.
ప్రధాన మంత్రి ముద్రా లోన్ వివరాలు
ఎస్‌బీఐ ప్రస్తుతం పలు రకాల రుణాలను అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి ముద్రా లోన్ పథకం వాటిలో ఒకటి. ఈ పథకం కింద ఇ-ముద్రా పేరుతో రుణాలు ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్నారు. దీనివల్ల బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లకుండానే ఇంట్లో నుంచే దరఖాస్తు చేసుకోగలుగుతారు. ఈ ముద్రా లోన్ కోసం ఎటువంటి పూచీకత్తు పెట్టాల్సిన అవసరం లేదు. తక్కువ పత్రాలతో, అతి తక్కువ వడ్డీకే ఈ రుణం పొందగలరు.
ఎవరు అర్హులు?
ఎస్‌బీఐ ఇ-ముద్రా ద్వారా చిరు వ్యాపారులకు రుణాలు అందిస్తోంది. లోన్ కోరుకునే వారు బ్యాంకుకు వెళ్ళకుండానే దీనిని పొందగలరు. అయితే లోన్ పొందేందుకు మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్ అయి ఉండాలి. అలాగే ఎస్‌బీఐలో పొదుపు ఖాతా లేక కరెంట్ అకౌంట్ కలిగి ఉండాలి. ఈ ఖాతా కనీసం ఆరు నెలలు పాతదై ఉండాలి. ప్రధాన మంత్రి ముద్రా యోజన స్కీమ్ కింద ఎస్‌బీఐ గరిష్టంగా లక్ష రూపాయల లోన్ అందిస్తోంది. ఐదేళ్ల టెన్యూర్ ఎంచుకుని ఈ రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు.
దరఖాస్తు విధానం
ఇ-ముద్రా లోన్ రూ. 50 వేలలోపు ఉంటే నేరుగా ఆన్‌లైన్‌లోనే పొందగలరు. రూ. 50 వేలు దాటితే బ్యాంకుకు వెళ్లాల్సి వస్తుంది. లోన్ పొందేందుకు పొదుపు లేదా కరెంట్ ఖాతా నంబర్, వ్యాపార ధ్రువీకరణ పత్రం, ఆధార్, కమ్యూనిటీ (జనరల్/ ఎస్సీ / ఎస్టీ/ ఓబీసీ/ మైనారిటీ), జీఎస్‌టీఎన్ సంఖ్య, షాప్ అడ్రస్, యూడీవైఓజీ ఆధార్ వివరాలు, బిజినెస్ రిజిస్ట్రేషన్ పత్రాలు అవసరం. ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తు విధానం
రుణం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియ కింద విధంగా ఉంటుంది:
ముందుగా, ఎస్‌బీఐ ఇ-ముద్రా వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
హోమ్ పేజీలో కనిపించే ‘ముద్రా లోన్ అప్లై నౌ’ ఆప్షన్ ఎంచుకోవాలి.
తరువాత సూచనలు, నిబంధనలను పరిశీలించి, వాటిని అంగీకరించి తదుపరి దశకు వెళ్లాలి.
అక్కడ మీ మొబైల్ నంబర్, పొదుపు లేదా కరెంట్ ఖాతా నంబర్‌తో పాటు, మీకు అవసరమైన రుణ మొత్తం నమోదు చేయాలి.
క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, ‘ప్రొసీడ్’ బటన్ నొక్కాలి.
అనంతరం, ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం పూర్తి చేయాలి. అడిగిన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
షరతులు, నిబంధనలను అంగీకరించి ‘ఇ-సైన్’ బటన్ క్లిక్ చేయాలి.
ఆధార్ ద్వారా ఇ-సైన్ పూర్తి కాగానే, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఆ ఓటీపీని నమోదు చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి.