ప్రపంచానికే గుడ్‌న్యూస్..! బయటపడ్డ భారీ బంగారు నిక్షేపాలు! ఇక ధరలు తగ్గనున్నాయా?
గత ఏడాదిలో బంగారం ధరలు 60 శాతం పెరిగి కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తుండగా, సౌదీ అరేబియాలో 78 లక్షల ఔన్సుల భారీ బంగారు నిక్షేపాలు వెలుగుచూశాయి. ఈ కొత్త నిల్వలు మార్కెట్‌లోకి వస్తే, బంగారపు సరఫరా పెరిగి, ప్రస్తుత అధిక ధరలు తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. గతంలో ఎప్పుడూలేని విధంగా కేవలం ఒక్క ఏడాదిలో బంగారం ధర 60 శాతానికిపైగా పెరిగింది. ఈ ధరల పెరుగుదలతో కొనుగోలుదారులు భయపడుతున్నారు. కానీ, బంగారంపై పెట్టుబడి పెడుతున్నవారు మాత్రం సంతోషంగానే ఉన్నారు. అయితే మన దేశంలో బంగారం కేవలం పెట్టుబడి వస్తువు కాదు.. అంతకంటే ఎక్కువగా దాన్ని అలంకారం కోసం ఉపయోగిస్తారు. భారతీయ కుటుంబాలకు బంగారంతో భావోద్వేగమైన బంధం ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని చాలా మంది ధరలు తగ్గితే మంచిది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ దేశంలో భారీ స్థాయిలో బంగారు నిక్షేపాలు బయటపడ్డాయి. ఈ గనుల నుంచి బంగారం వెలికి తీసి సరఫరా మొదలైతే.. డిమాండ్‌కి తగ్గ సప్లయ్ పెరిగితే ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇంతకీ ఈ భారీ బంగారు నిధులు ఎక్కడ బయటపడ్డాయో ఇప్పుడు తెలుసుకుందాం..
చమురు అంటే గుర్తొచ్చే మొదటి పేరు సౌదీ అరేబియా. కానీ ఇప్పుడు ఆ దేశంలో భారీ స్థాయిలో కొత్త బంగారు నిక్షేపాలు వెలుగు చూశాయి. దేశంలోని నాలుగు కీలక ప్రాంతాల్లో కలిపి సుమారు 78 లక్షల ఔన్సుల బంగారం కొత్తగా గుర్తించినట్లు ప్రభుత్వ రంగ మైనింగ్ సంస్థ మాడెన్ (Maaden) అధికారికంగా ప్రకటించింది. సౌదీ ప్రభుత్వం చేపట్టిన విస్తృత అన్వేషణ, డ్రిల్లింగ్ కార్యక్రమాల ఫలితంగా ఈ సంపద బయటపడింది. ముఖ్యంగా మంసూరా–మస్సారా, వాడి అల్ జౌ, ఉరుక్, ఉమ్ అస్ సలాం ప్రాంతాల్లో ఈ బంగారు నిక్షేపాలు ఉన్నట్లు మాడెన్ వెల్లడించింది. తాజా కనుగొన్న బంగారు నిధులతో మంసూరా–మస్సారా గనిలో మొత్తం బంగారు నిల్వలు దాదాపు 1.04 కోట్ల ఔన్సులకు చేరుకున్నాయి. ఇది సౌదీ మైనింగ్ రంగానికి చారిత్రక మైలురాయిగా నిపుణులు పేర్కొంటున్నారు.
రాగి, నికెల్ నిక్షేపాలు కూడా..
ఇది కేవలం బంగారంతోనే ఆగడం లేదని సౌదీ అధికారులు చెబుతున్నారు. అరేబియన్ షీల్డ్ ప్రాంతంలో రాగి, నికెల్ వంటి ఇతర లోహాలపై కూడా అన్వేషణ కొనసాగుతోంది. అయితే తాజా ప్రకటనలో ప్రధానంగా బంగారు నిక్షేపాల గురించే అధికారిక ధృవీకరణ లభించింది. ఈ పరిణామం సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రవేశపెట్టిన విజన్ 2030 వ్యూహానికి కీలక బలాన్ని ఇస్తోంది. చమురు మీద ఆధారాన్ని తగ్గించి, మైనింగ్‌ను దేశ ఆర్థిక వ్యవస్థలో మూడో కీలక స్థంభంగా మార్చాలన్నదే ఈ విజన్ లక్ష్యం. మాడెన్ సీఈఓ బాబ్ విల్ట్ మాట్లాడుతూ… ఈ ఫలితాలు మా దీర్ఘకాలిక వ్యూహానికి నిదర్శనం. సౌదీ భూభాగంలో ఇంకా ఎన్నో ఖనిజ సంపదలు వెలుగులోకి రావాల్సి ఉంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
